మహారాష్ట్రలో అసలు ఎం జరుగుతుంది? శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటికి బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే వెళ్లడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సిల్వర్ ఓక్స్ నివాసానికి సంజయ్ చేరుకున్నారు. ఆయనతో పాటు ఎన్సీపీ సీనియర్ లీడర్ జయంత్ పాటిల్ కూడా ఉన్నారు.
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాకుండా అక్కడ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటికి బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే వెళ్లడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.
ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సిల్వర్ ఓక్స్ నివాసానికి సంజయ్ చేరుకున్నారు. ఆయనతో పాటు ఎన్సీపీ సీనియర్ లీడర్ జయంత్ పాటిల్ కూడా ఉన్నారు. సంజయ్ కాకడే రాజ్యసభ ఎంపీ. రియల్ ఎస్టేట్ వ్యాపారి. శరద్ పవార్ తో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి.
Also read: కర్ణాటక గౌడలకు మహారాష్ట్ర పవార్ లకు చాలా దగ్గరి పోలిక
ఇకపోతే, మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరగనున్న విషయం తెలిసిందే. గవర్నర్ తీరుపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉదయం 11.30గంటలకు వాదనలు ప్రారంభం కానున్నాయి.
జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. సుప్రీం కోర్టులో వాదనలు ప్రారంభం కానున్న ఈ సమయంలో శరద్ పవార్‌తో సంజయ్ భేటీ కావడం సరికొత్త చర్చకు తెరతీసింది.
అంతేకాకుండా, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే, కేంద్రంలో శరద్ పవార్ కు, అతని కూతురు సుప్రియ సూలెకు కూడా మంత్రి పదవులు ఇస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు చేస్తున్న సందర్భంలో ఈ భేటీ చాలా ముఖ్యమైనదిగా అన్ని వర్గాలు భావిస్తున్నారు.
Also read: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీం లో రిట్ పిటిషన్... మరికాసేపట్లో విచారణ
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేజిక్ ఫిగర్ 145. బీజేపీకి ఇంకో 40 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్సీపీ శాసన సభ్యులంతా తమకు మద్దతు తెలుపుతున్నారని, ఆ పార్టీకి ఇక శరద్ పవార్ ఒక్కరే మిగిలి ఉన్నారని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నిన్న సాయంత్రం శరద్ పవార్ పిలిచినా భేటీకి నలుగురు మినహా దాదాపుగా అందరూ ఎన్సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసలు ఎం జరగబోతుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదపడంలో బిజీ అయిపోయింది. బీజేపీ రెబెల్స్ బీజేపీకే మద్దతివ్వనున్నారు. విదర్భ ప్రాంతం నుంచి గెలిచినా ఒక ఇద్దరు స్వతంత్రులు శివసేనకు మద్దతిస్తూ, వారి ఎమ్మెల్యేలు ఉంటున్న హోటల్ లోనే ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నయా ప్రణాలోకాలను రచిస్తోంది. ఎం చేసైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పావులు కదుపుతోంది.