పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు దేశప్రజలు నివాళులర్పిస్తూనే ఉన్నారు. దాడి జరిగిన తర్వాతి రోజు నుంచి సోషల్ మీడియా మొత్తం సంతాప చర్చలతో నిండిపోయింది. ఏ ఇద్దరు కలిసినా పుల్వామా గురించి మాట్లాడుకుంటూ, వీర జవాన్ల ధైర్యసాహసాలను కొనియాడారు.

ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యవహారశైలి వివాదాస్పదమైంది. ముష్కరుల దాడిలో నేలకొరిగిన సైనికుడు అజిత్ కుమార్‌కు కడసారి నివాళులర్పించేందుకు ఆయన హాజరయ్యారు.

అశేష జనవాహిని వెంటరాగా సైనిక వాహనంలో అజిత్ కుమార్ భౌతిక కాయాన్ని అంతిమయాత్రగా తీసుకెళ్లారు. అయితే అదే వాహనంపై ఎంపీ సాక్షి మహరాజ్ జనానికి నవ్వుతూ అభివాదం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఎంపీపై ఫైరయ్యారు. సాక్షి మహరాజ్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.  జవాన్ అంతిమ యాత్రను అభినందన యాత్రగా ఎంపీ ఫీలవుతున్నారని.. ఇది సిగ్గు చేటంటూ ఒకరు ట్వీట్ చేశారు.