బీజేపీ ఫైర్‌బ్రాండ్, ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేతల అకాల మరణానికి చేతబడే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోమవారం భోపాల్‌లో మీడియాతో మాట్లాడిన సాధ్వి... బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్రపూజలు చేస్తున్నాయని... మహారాజ్ గారు నాకు చెప్పారని.. ఆయన చెప్పినట్లుగానే పార్టీ నేతలకు ఇప్పుడు చెడుకాలం జరుగుతోందన్నారు.

అయితే అప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని తాను మర్చిపోయానని.. కానీ తమ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు ఒక్కొక్కరుగా తమను విడిచి వెళ్తున్నారని.. మహారాజ్ చెప్పింది నిజమేనేమోనని తనకు ఇప్పుడు అనిపిస్తోందని సాధ్వి బాంబు పేల్చారు.

కాగా.. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను విచారించిన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే... తన శాపం కారణంగానే ఉగ్రకాల్పుల్లో మరణించారంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

ఆ తర్వాత మహాత్మా గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడని అభివర్ణించడం ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి కూడా సాధ్వి విమర్శలు ఎదుర్కొన్నారు.

బీజేపీ అధిష్టానం ఆమెపై సీరియస్ అవ్వడంతో ప్రజ్ఞాసింగ్ వెనక్కి తగ్గారు. అయితే ఇరవై రోజుల వ్యవధిలో బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన నేపథ్యంలో సాధ్వి ‘‘చేతబడి’’ వ్యాఖ్యలు చేశారు.