బీజేపీ ఎంపీ , బెంగాలీ నటి రూపా గంగూలీ కుమారుడుని కోల్ కత్తా పోలీసులు అరెస్టు చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడమే కాకుండా.. కోల్ కత్తా క్లబ్ గోడను తన కారుతో ఢీ కొట్టాడు. ఈ నేపథ్యంలో అతనిని అరెస్టు చేశారు. కాగా...  ఎంపీ రూపా గంగూలీ కుమారుడు ఆకాష్ ముఖోపాధ్యాయ(20) ఆ సమయంలో మద్యం సేవించి ఉండటం గమనార్హం. 

ఆకాష్.. మద్యం సేవించి ర్యాష్ గా వచ్చి క్లబ్ గోడను ఢీకొట్టాడు. దీంతో గూడ కూలిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. తృటిలో చాలా మంది ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారని లేదంటే... తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉండేదని వారు చెబుతున్నారు. అయితే... అతను నిజంగా మద్యం సేవించి ఉన్నాడో లేదో క్లారిటీ లేదని అందుకే  ఆ విషయం తెలుసుకునేందుకు అతని రక్త నమూనాలకు ల్యాబ్ కి పంపినట్లు చెప్పారు. ఈ సంఘటన గత రాత్రి చోటుచేసుకుంది.  కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాకుండా ఈ విషయాన్ని మీడియా పదే పదే ప్రసారం చేయడంపై ఎంపీ స్పందించారు.

ట్విట్టర్ లో దీనిపై ఆమె వరస ట్వీట్లు చేశారు. ‘‘ నా కుమారుడికి మా ఇంటి దగ్గరల్లో యాక్సిడెంట్ అయ్యింది. చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేనే పోలీసులకు ఫోన్ చేశాను. దీనిని రాజకీయం చేయకండి. నాకు నా కొడుకు అంటే ప్రేమ ఉంది. తనని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసు. నేను తప్పు చేయను. తప్పు చేయనివ్వను’’ అంటూ ట్వీట్ చేసి ప్రధాని నరేంద్రమోదీని ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు.

మరో ట్వీట్ లో తాను తన కొడుకుతో మధ్యాహ్నం మాట్లాడానని..లంచ్ గురించి డిస్కస్ కూడా చేసుకున్నామని... మీడియాలో మాత్రం అన్నీ తప్పులు చెబుతున్నారంటూ ఆమె మండిపడ్డారు.