న్యూడిల్లీ: దేశ రాజధాని డిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు నిరసన బాట పట్టారు. అయితే కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పార్టీకి, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఈ రైతు ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలంతోనే జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. 

అయితే మోదీ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే కాకుండా కాంగ్రెస్ హయాంలో జరిగిన ఓ భారీ కుంభకోణంపై ప్రజల దృష్టి మరల్చడానికే వ్యవసాయ చట్టాలపై అబద్దపు ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ చేస్తోందని బిజెపి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికన వెల్లడించారు. 

''కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై రాహుల్ కాంగ్రెస్ అబద్దపు ప్రచారం చేయడానికి కారణముంది. అగస్టా స్కామ్ నుండి రాజవంశాన్ని(గాంధీ కుటుంబాన్ని) కాపాడుకుని ప్రజల దృష్టిని మరల్చడానికే వ్యవసాయ చట్టాలను వివాదాస్పదం చేస్తున్నారు. అంతే గానీ రైతులు, వారి కష్టాలు గత 70 ఏళ్లుగానే కాదు ఇప్పుడూ కాంగ్రెస్ పార్టీకి పట్టదు'' అంటూ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. 


 
వ్యవసాయ చట్టాలను వివాదాస్పదం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందని... అందుకు గల కారణాలను తెలుపుతున్న వ్యాఖ్యలను ఎంపీ తన ట్వీట్ కు జతచేశారు. వ్యవసాయ చట్టాలు అమలు చేసిన రెండు నెలల తర్వాత రైతు ఉద్యమం మొదలవడం వెనుక కాంగ్రెస్ కుట్ర దాగివుందని... ఇందుకు సంబంధించిన తేదీలు, కారణాలను కూడా తెలియజేశారు.