నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో హింసకు ప్రధాన కారణమవుతున్న ఉగ్రవాదులకు ప్రధాన స్థావరంగా మారిన జమ్మూ కశ్మీర్ రాష్ట్రంపై చర్యలు ప్రారంభించింది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను, ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఇవాళ ప్రకటించింది. ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంలో తాను భాగస్వామినయినందుకు చాలా గర్వంగా వుందని బిజెపి ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ పై తీసుకున్న నిర్ణయాన్ని  సమర్థిస్తూ ఆయన ట్వీట్ చేశారు. '' చరిత్రలో నిలిచిపోయే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకునే పార్లమెంట్ లో నేను భాగస్వామినవడం గర్వంగా వుంది. ఆర్టికల్ 370ని రద్దుచేయడం చాలా సాహసోపేతమైన చర్య. 70 ఏళ్లపాటు జమ్మూకాశ్మీర్ లో సాగిన రాచరిక పాలన  ఈ నిర్ణయంతో అంతమయ్యింది. ఇకపై ఆ రాష్ట్ర ప్రజలు నిజమైన పాలనను,  డెవలప్‌మెంట్, భద్రతను పొందుతారు. ఇంతటి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాన మోదీ, హోంమంత్రి అమిత్ షా కు కృతజ్ఞతలు.'' అని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.  

 '' పార్లమెంట్ చరిత్రలోనే ఇది గొప్ప రోజుగా నిలిచిపోనుంది. 13ఏళ్ళు నేను పార్లమెంట్ లో గడిపిన రోజులన్నింటి కంటే ఈరోజు చాలా గొప్పది. జమ్ము కశ్మీర్ విషయంలో జరిగిన చారిత్రాత్మక తప్పిదాన్ని సరిచేసేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు పట్టుదలతో, అంకితభావంతో పనిచేసి ఈ  నిర్ణయం తీసుకున్నారు.''  అంటూ మరో ట్వీట్ ద్వారా  ఎంపీ చంద్రశేఖర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.