Asianet News TeluguAsianet News Telugu

అంగవైకల్యం పొందిన సైనికుల శ్రేయస్సుకు కట్టుబడదాం: రాజీవ్ చంద్రశేఖర్

ఈ వారం మనం 47వ విజయ్ దివాస్‌ జరుపుకుంటున్నాం. 1971లో 13 రోజుల పాటు సాగిన భారత్-పాక్ యుద్ధంలో విజయం సాధించినందుకు గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 16ని విజయ్ దివాస్‌గా జరుపుకుంటున్నాం.

BJP MP Rajeev chandrasekhar tweeted on vijay diwas
Author
New Delhi, First Published Dec 16, 2018, 5:18 PM IST

ఈ వారం మనం 47వ విజయ్ దివాస్‌ జరుపుకుంటున్నాం. 1971లో 13 రోజుల పాటు సాగిన భారత్-పాక్ యుద్ధంలో విజయం సాధించినందుకు గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 16ని విజయ్ దివాస్‌గా జరుపుకుంటున్నాం. ఆధునిక యుద్ధతంత్రంపై ఏ మాత్రం అవగాహన లేకపోయినప్పటికీ ఈ యుద్ధంలో భారతీయ జవాన్లు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు.

ఈ యుద్ధంలో 3,843 మంది భారత సైనికుల శౌర్యపరాక్రమాలతో పాకిస్తాన్ ఓటమిని అంగీకరించి మనకు లొంగిపోయింది. తద్వారా బంగ్లాదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన త్రివిధ దళాలకు చెందిన సుమారు 1,313 మంది సైనికులకు భారతప్రభుత్వం సైనిక పురస్కారాలు ప్రధానం చేసింది.

ఇందులో నలుగురు పరమ వీర చక్ర అవార్డు అందుకున్నారు. లాన్స్ నాయక్ అల్బర్ట్ ఇక్కా, లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్, ఫీల్డ్ ఆఫీసర్ నిర్మల్ సింగ్ షేకావ్, మేజర్ హోస్హియార్ సింగ్‌లను పరమ వీర చక్రకు ఎంపిక చేశారు. యుద్ధంలో దేశానికి చిరస్మరణీయ విజయాన్ని అందించిన సుమారు 9,851 మంది తీవ్ర గాయాల పాలై అవయవాలను కోల్పోయారు.

వీరి త్యాగాలకు గుర్తుగా ఈ ఏడాదిని ‘‘ఇయర్ ఆఫ్ డిజేబుల్డ్ సోల్జర్స్ ఇన్ లైన్ ఆఫ్ డ్యూటీ’’గా పరిగణించాలని ఇండియన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. అవయవాలు కోల్పోయినా రక్తమోడుతున్న శరీరంతోనే వారు యుద్ధం చేసి జవాన్ అన్న పదానికి విలువనిచ్చారు.

మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో, ఎవీఎస్ఎం ఎస్ఎం, మేజర్ సుజిత్ కుమార్ పంచోలీ, కెప్టెన్ భగవాన్ సింగ్ జోధాతో పాటు వేలాది మంది 1971 యుద్ధంలో అంగవైకల్యానికి గురయ్యారు. యుద్ధ సమయంలో పొరపాటున ల్యాండ్‌మైన్ మీద అడుగు వేయడంతో పెద్ద పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో మేజర్ జనరల్ కార్డోజో కాలు చిధ్రమైంది. నొప్పిని పంటి బిగువున బిగపెట్టి ఆయన యుద్ధం చేశారు. అంతేకాదు తెగిపడిన కాలిని తోటి జవాన్‌కిచ్చి దానిని పూడ్చిపెట్టమని ఆదేశించారు. అంగవైకల్యం ఆయన కెరీర్‌ మీద ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

ఆ తర్వాత అలాగే జీవితాన్ని కొనసాగించిన కార్డోజో భారతసైన్యంలో అంగవైకల్యం ఉన్నప్పటికీ విధులు నిర్వర్తించిన మొదటి అధికారిగా రికార్డుల్లోకి ఎక్కారు. అంతేకాకుండా ఆ తర్వాత ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కి బ్రిగేడియర్ జనరల్‌గా సేవలందించారు.

ఇలా అంగవైకల్యంతో ఉన్నా విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల స్మృత్యార్ధం ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మేజర్ జనరల్ సునీల్ కుమార్ రజ్డాన్ హాజరయ్యారు. ఆయనదో వీరోచిత గాథ... 1994లో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తుండగా.. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో సునీల్ కుమార్ రెండు కాళ్లలో నుంచి తూటాలు దూసుకెళ్లడంతో ఆయన శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు.

అయినప్పటికీ మనోస్థైర్యం కోల్పోకుండా వీల్-ఛైర్‌లోనే విధులకు హాజరవుతూ అంగవైకల్యాన్ని జయించారు. వీరితో పాటు అవయవాలను కోల్పోయిన ఎంతోమంది సైనికులు మనోనిబ్బరంతో తమ రోజువారి విధులకు హాజరవుతూ స్పూర్తిని రగలిస్తున్నారు.

వాసా వీరభద్రుడు అనే సైనికుడిది మరో దీనగాథ. మద్రాస్ ఇంజనీర్స్ విభాగానికి చెందిన ఇతనికి అంగవైకల్యం కింద పెన్షన్ మంజూరైంది.. అయితే అతని మానసిక స్థితి కారణంగా ఈ విషయం వీరభద్రుడికి తెలియదు. అయితే కొద్దిరోజుల తర్వాత తనకు పెన్షన్ మంజూరైన విషయం తెలుసుకున్న వీరభద్రుడు 1976 నుంచి రావాల్సిన బకాయి మొత్తం చెల్లించాల్సిందిగా కోరాడు.

అయితే కఠినమైన నిబంధనల దృష్ట్యా రక్షణ శాఖకు చెందిన గణాంక సిబ్బంది ఆయన విజ్ఞప్తిని తిరస్కరించారు. పెన్షన్ సోమ్ము కోసం మాజీ సైనికుడు చేస్తున్న పోరాటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి వెళ్లడంతో ఆమె ఆయనకి న్యాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా అంగవైకల్యానికి గురైన ఎంతోమంది మాజీ సైనికులు తమ పెన్షన్ సహా ఇతర భత్యాలను పొందలేకపోతున్న సంగతి ఇప్పటి కాదు. దీనిని గుర్తించిన నేను 2011లో నాటి రక్షణ మంత్రి ఏకే. ఆంటోనీకి లేఖ రాశాను. ఈ క్రమంలో మాజీ సైనికుల సంక్షేమ శాఖ ఒక మెమోని జారీ చేసింది.

దీని ప్రకారం ఎవరైతే పెన్షన్, ఇతర భత్యాల కోసం కింద కేంద్ర రక్షణ శాఖతో న్యాయపరంగా పోరాడుతున్నారో.. వారు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిందిగా తెలిపింది. దీని బట్టి దేశం కోసం అవయవాలను పొగొట్టుకున్న వారి సంక్షేమం పట్ల నాటి యూపీఏ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో మాజీ సైనికుల సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా నేను 2014 ఫిబ్రవరిలో మరోసారి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీకి లేఖ రాశాను. దీంతో ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. నా విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంగవైకల్యం పొందిన సైనికుల సంక్షేమంపై దృష్టి పెట్టింది.

2015లో రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ మాజీ సైనికుల, అంగవైకల్యం పొందిన సైనికులకు పెన్షన్, ఇతర భత్యాలు పొందడానికి  ఎదురవుతున్న వ్యవస్థా పరమైన నిబంధనలపై దృష్టి పెట్టారు. కఠినంగా ఉన్న నిబంధనలు సడలించడానికి ఆయన నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

వీటిపై అధ్యాయనం చేసిన సదరు కమిటీ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపింది. అయితే వీటిని రక్షణ శాఖ అటకెక్కించడంతో.. ఇప్పటికీ ఎంతోమంది మాజీ సైనికులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రక్షణ శాఖలో ఉన్న ఈ నిష్ప్రయోజనమైన నిబంధనలను గమనిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిబంధనలు సడలించేలా కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.

అంగవైకల్యం పొందిన సైనికులు, వారి కుటుంబాలు న్యాయంగా తమకు రావాల్సిన పెన్షన్, ఇతర భత్యాలు పొందేందుకు చేస్తున్న పోరాటం నన్ను తీవ్రంగా కలిచివేసింది. అందుకే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు పార్లమెంట్‌లోనూ లేవనెత్తుతా.

ఎన్నో ఏళ్లుగా పెన్షన్ కోసం పోరాడుతున్న సైనికుల వ్యాజ్యాలపై చర్యలు తీసుకుంటామని, అలాగే అందుకు ఎదురవుతున్న నిబంధనలను సడలిస్తామని.. అతి త్వరలో మిగిలిన వారి సమస్యలను కూడా పరిష్కరిస్తామంటూ రక్షణ శాఖ ప్రతినిధి గత నెలలో ట్వీట్ చేశారు.

తద్వారా రాబోయే కాలంలో రక్షణ శాఖ సైనికుల అండగా ఉంటుందని ఆశిస్తున్నా. దేశ రక్షణ కోసం సైనికులు వారి జీవితాలను అవయవాలను పణంగా పెడుతున్నారు. వారు చేస్తున్న సేవకు, త్యాగాలకు ఈ దేశం ఎప్పటికి రుణపడి ఉంటుంది.

ఇట్లు,

రాజీవ్ చంద్రశేఖర్

రాజ్యసభ్యులు

 

Follow Us:
Download App:
  • android
  • ios