కార్గిల్‌ యుద్ధంలో విజయానికి గుర్తుగా విజయ్ దివస్‌ను నేడు జరుపుకుంటున్నామని.. కానీ 2004-09 మధ్య కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం విజయ్ దివస్‌ను పట్టించుకోలేదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు రాజీవ్ చంద్రశేఖర్. విజయ్ దివస్ సందర్భంగా ఆయన కార్గిల్ అమర వీరులకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో అమరవీరులకు సరైన గౌరవం దక్కలేదంటూ జూలై 26న విజయ్ దివస్‌గా  నిర్వహించాలంటూ  2009లో తాను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కి రాసిన లేఖను రాజీవ్ ట్వీట్‌లో జత చేశారు. జూలై 26న కార్గిల్ యుద్ధంలో మన శత్రువులపై సాయుధ దళాలు విజయం సాధించిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. 

ఈ రోజు కేవలం మన దేశం గర్వించదగ్గ రోజు మాత్రమే కాదు.. శత్రువులపై వీరోచితంగా పోరాడిన వేలాది మంది సాయుధ బలగాల త్యాగాల నుంచి స్పూర్తి పొందాల్సిన దినం..  నాడు జాతీయ సమైక్యత, విధి నిర్వహణ కోసం వీర జవాన్లు సాగించిన సంఘర్షణ నుంచి కోట్లాది భారతీయుల లాగానే నేను కూడా స్ఫూర్తిపొందుతాను. 

అలాగే ఈ సంఘర్షణలో వారి వీరోచిత పోరాటం.. శ్రద్ధాంజలి, గౌరవం, సెల్యూట్‌ చేయడానికి అర్హమైనవి. వారి త్యాగాలను, విధి నిర్వహణలో అంకిత భావాన్ని గుర్తు చేసుకోవడం మన దేశ ప్రజల కర్తవ్యం.

అందువల్ల జూలై 16ను కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకోవాలని నేను రక్షణ శాఖకు, భారత ప్రభుత్వానికి, రాజ్యసభలో నా సహచర సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని రాజీవ్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. 

ఆయన ప్రశ్నకు స్పందించిన నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ... 2010 జూలై 26 న అమర్ జవాన్ జ్యోతి వద్ద కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తామని లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రతిని రాజీవ్ ట్వీట్టర్‌లో షేర్ చేశారు.