17వ లోక్‌సభ స్పీకర్‌ అభ్యర్ధిగా ఓమ్ బిర్లాను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. రాజస్తాన్‌లోని కోట నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. మంగళవారం ఓమ్ బిర్లా స్పీకర్‌గా నామినేషన్ వేయనున్నారు.

1962 నవంబర్ 23న రాజస్థాన్‌లో శ్రీకృష్ణ బిర్లా, శకుంతల దేవీ దంపతులకు జన్మించారు. కోటాలోని ప్రభుత్వ కామర్స్ కాలేజీలో కామర్స్ పట్టా పొందారు. విద్యార్ధి రాజకీయ నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఓమ్ బిర్లా.. 1979లో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా సేవలందించారు.  

1991 నుంచి 12 సంవత్సరాల పాటు బీజేపీ యువమోర్చాలో కీలక నాయకుడిగా పనిచేశారు. 2003లో తొలిసారిగా కోట సౌత్ నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.

2014లో తొలిసారి కోటా నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓమ్ బిర్లా కాంగ్రెస్ అభ్యర్ధి రామ్ నారాయణ్ మీనాపై 2.5 లక్షల మెజారిటీతో గెలుపొందారు.