జైపూర్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మృతిచెందారు. తాజాగా రాజస్థాన్ కు చెందిన బిజెపి మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో మృతిచెందారు.

గత నెల అక్టోబర్ లో ఆమెకు కరోనా సోకగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందారు. అయినప్పటి ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించి ఆదివారం మృతిచెందారు. ఎమ్మెల్యే మృతితో ఆమె కుటుంబంలోనే కాదు రాష్ట్రంలో, నియోజకవర్గ పరిధిలో విషాదం నెలకొంది. మహేశ్వరి మృతిపై బిజెపి నాయకులతో పాటు ఇతర పార్టీలవారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ కూడి మహేశ్వరి మృతికి సంతాపం ప్రకటించారు. '' కిరణ్ మహేశ్వరి గారి అకాల మృతి ఎంతగానో బాధించింది.  ఎంపి, ఎమ్మెల్యేగానే కాకుండా కేబినెట్ మంత్రిగా రాజస్థాన్ ప్రభుత్వంలో కొనసాగిన ఆమె రాష్ట్రంలోని బడుగు  బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర అభివృద్దికి ఎంతగానో కృషిచేశారు. ఎంతో బాధలో వున్న ఆమె కుటుంబానికి సంతాపం తెలుపుతున్నా. ఓం శాంతి'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రధాని సంతాపం తెలిపారు. 

 

రాజస్థాన్ లో అక్టోబరు నెలలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మహేశ్వరి కరోనా బారినపడ్డారు. ఎన్నికల బాధ్యురాలిగా నియమితులైన మహేశ్వరీ విస్తృతంగా పర్యటించడం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో కరోనా బారిన పడ్డారు. గత ఎన్నికల్లో రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.