ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితంగా ఉండే బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ కుమారుడు ప్రభుత్వాధికారిని బ్యాట్‌తో కొట్టాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఓ మున్సిపల్ ఉద్యోగి స్పెషల్ డ్రైవ్‌ చేపట్టారు.

ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియా ఆయనతో గొడవకు దిగారు. ఈ సమయంలో మాటా మాటా పెరిగిన ఆకాశ్ పక్కనే ఉన్న బ్యాట్ తీసుకుని సదరు అధికారిని కొట్టడం ప్రారంభించారు.

అక్కడున్న మిగిలిన నేతలు అడ్డుకున్నా వినకుండా క్రికెట్ బ్యాట్‌తో చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో బీజేపీ నేత హితేశ్ బాజ్‌పాయ్ రంగంలోకి దిగారు.

సదరు ప్రభుత్వాధికారి విజయ్‌ను లంచం అడిగినందుకే ఆయన ఇలా  ప్రవర్తించారని వెనకేసుకొచ్చారు. ఇది ఆరంభం మాత్రమేనని.. లంచగొండులను సహించేది లేదని తేల్చి చెప్పారు. కావాలంటే ఆకాశ్‌ను అరెస్ట్ చేయవచ్చని.. అయితే అంతకంటే ముందు లంచం అడిగిన అధికారిని అరెస్ట్ చేసి జైళ్లో పెట్టాలని బాజ్‌పాయ్ డిమాండ్ చేశారు.