Asianet News TeluguAsianet News Telugu

Rajya Sabha Election 2022: ఓటు వేయడానికి స్ట్రెచర్‌పై వచ్చిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న వేళ మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ ఎమ్మెల్యే తన ఓటు వేయడానికి ఏకంగా హాస్పిటల్ నుంచి వచ్చేశారు. అంబులెన్స్ నుంచి స్ట్రెచర్‌పై దిగిన ఆ ఎమ్మెల్యే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

bjp mla casted vote coming from hospital on stretcher
Author
Mumbai, First Published Jun 10, 2022, 4:51 PM IST

ముంబయి: రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పార్టీలు ఎమ్మెల్యేలతో తప్పనిసరిగా ఓటు వేయిస్తున్నాయి. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఓటింగ్ వేయిస్తున్నాయి. ఇవి రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర పోటీని వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఉన్న పోటీ తెలియనిది కాదు. అందుకే ఇక్కడ ఏకంగా ఓ ఎమ్మెల్యేను హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌లో ఓటు కోసం రప్పించారు. ఆ ఎమ్మెల్యే స్ట్రెచర్‌పై వచ్చి ఓటు వేయడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది.

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిలక్ పూణెలని కస్బా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఈ క్యాన్సర్ మూలంగానే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆమె కచ్చితంగా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందేనన్న ఆందేశాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆ మహిళా ఎమ్మెల్యే హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌లో పోలింగ్ సెంటర్‌కు వచ్చింది. అంబులెన్స్ నుంచి స్ట్రెచర్‌పై దిగి ఓటేసింది. ఆమె ఓటు వేసే సమయంలో భర్త శైలేష్ శ్రీకాంత్ సహకరించడానికి అధికారులు అనుమతించారు. 

నేడు రాజ్య‌సభ‌లోని 16 స్థానాలకు ఓటింగ్ జ‌రుగ‌నున్న‌ది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ వెలువడగా.. ఇప్ప‌టికే 11 రాష్ట్రాల్లోని 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో శుక్రవారం(నేడు) మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానాలోని  మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే..  జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానాలలో 16 స్థానాలకు నేడు ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి. ఈ క్ర‌మంలో రాజస్థాన్,  మహారాష్ట్ర వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కఠినమైన పోటీలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో  ఈ రాష్ట్రాల్లో రిసార్ట్ రాజకీయాలకు తెర లేసింది. రాజస్థాన్ లో 4 స్థానాలకు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ స్థానాల్లో గట్టి పోటీ ఉండ‌టంతో బీజేపీ త‌న ఎమ్మెల్యేలను జైపూర్ లోని దేవీ రతన్ రిసార్ట్ కు తరలించింది.  ఇప్పటికే అధికార పార్టీ శివసేన తమ  ఎమ్మెల్యేలను బస్సుల్లో ముంబయిలోని ఓ హోటల్ కు తరలించింది.  బీజేపీకి సంఖ్య బలం లేకున్న రాజస్థాన్ లో అభ్యర్థిని నిలబెట్టడంతో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇటు కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉంది. తమ ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డానికి తీవ్రంగా శ్రమిస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios