కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బాంబు దాడి చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా గంజ్‌ బసోడా బీజేపీ ఎమ్మెల్యే లీనా జైన్‌కు లేఖ పంపారు. ఆ లేఖ చూసి కంగారుపడిపోయిన ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమిత్‌ షా ఎప్పుడు పట్టణానికి వస్తే అప్పుడు ఆయనపై బాంబు దాడులకు తెగబడతామని, ఆయనను హతమారుస్తామని తనకు లేఖ వచ్చిందని ఎమ్మెల్యే లీలా జైన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్ధానిక రైల్వే స్టేషన్‌, ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్‌లను పేల్చివేస్తామని,  తనకు అందిన హెచ్చరిక లేఖలో పేర్కొన్నారని ఎమ్మెల్యే లీనా జైన్ చెప్పారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. హెచ్చరిక లేఖ నేపథ్యంలో రైల్వే స్టేషన్‌, ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామని, మతిస్ధిమితం లేని కొందరు ఈ హెచ్చరికలు చేసినట్టుగా ప్రాధమిక దర్యాప్తులో తేలిందని విదిశ ఎస్పీ వినాయక్‌ వర్మ చెప్పారు.