Asianet News TeluguAsianet News Telugu

మహిళపై నోరుపారేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో పోస్టు చేసి కాంగ్రెస్ విమర్శలు

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ఓ మహిళపై నోరుపారేసుకున్నాడు. తన ఆస్తిని కూల్చేయవద్దని, చట్టబద్ధంగానే తాను నిర్మించానని చెబుతున్న మహిళపై సీరియస్ అయ్యారు. వెంటనే పోలీసులను పిలిచి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాలని, జైలులో వేయాలని ఆదేశించారు. 
 

bjp mla abuses woman on camera congress demands apology in karnataka
Author
First Published Sep 3, 2022, 4:07 PM IST

బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే లింబావలి ఓ మహిళపై నోరుపారేసుకున్నాడు. ఆమెతో తప్పుగా వ్యవహరించారు. తన ఆస్తిని కూల్చేయవద్దని ఆమె ప్రాధేయపడుతుండగా.. ఆమెపై ఎమ్మెల్యే ఆగ్రహించారు. ఆమె ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని నేలకేసి కొట్టాడు. ఆమెను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు. జైలులో పెట్టాలని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బీజేపీ పై విమర్శలు సంధించింది. బీజేపీ మహిళా విరోధ పార్టీ అని మండిపడింది. ఈ వీడియోను రణదీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. అదే విధంగా కన్నడ భాషలో రాసుకొచ్చారు.

కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రణదీప్ సుర్జేవాలా ఈ వీడియోను షేర్ చేస్తూ.. ప్రజా ప్రతినిధిగా ఉన్న బీజేపీ నేత ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు క్షమించరానిది అని పేర్కొన్నారు. వెంటనే ఆ బీజేపీ నేత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ పై మాట్లాడే బీజేపీ వారి పట్ల దురుసుగా వ్యవహరించడం దారుణం అని ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్‌కు రెస్పాండ్ అవుతూ బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి తాను క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన రూత్ సగాయ్ మేరీ కొన్నేళ్ల నుంచి రాజకాలువ (వరదలు వచ్చినప్పుడు నీటిని బయటకు పంపే కాలువ)ను ఆక్రమించుకుని ప్రజలకు సమస్య తెచ్చి పెట్టిందని పేర్కొన్నారు. ఆమెను వెంటనే ఖాళీ చేయాలని అడిగామని తెలిపారు. ఇప్పుడే తమ కార్యకర్తను పంథం విడాలని అడగాలని డిమాండ్ చేశారు.

డ్రైన్ వాటర్‌ను తీసుకెళ్లే ఓ కాలువ పై కట్టిన కమర్షియల్ బిల్డింగ్ కంపౌండ్ వాల్‌ను బెంగళూరు వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ కూల్చేసింది.  ఈ కాంప్లెక్స్ యజమాని రుత్ సగాయ్ మేరీ అమీలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించి డిపార్ట్‌మెంటల్ అనుమతులు తీసుకున్న తర్వాత దీన్ని నిర్మించినట్టు ఆమె తెలిపారు. కానీ, ఆ కాంపౌండ్ వాల్‌ దాదాపు సగం కూల్చేశారు. 

వర్షాల కారణంగా సోమవారం మహాదేవ్‌పూర్ నియోజకవర్గంలో వరద నీరు భారీగా నిలిచింది.  

తన ఆస్తి కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆమె డాక్యుమెంట్లతో ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లారు. తాము నిర్మించుకున్న ఇల్లు చట్టబద్ధమేనని వాదించారు. ఎమ్మెల్యే ఆ డాక్యుమెంట్‌ను గుంజుకునే ప్రయత్నం చేశారు. ముందుగా తాను చెప్పే విషయాలను వినాలని ఆమె కోరారు.

దయచేసి ఇది ప్రభుత్వ భూమి కాదని, ఇది తన భూమి అని ఆమె స్పష్టం చేశారు. తాను గౌరవంగా మాట్లాడుతున్నానని, ఎమ్మెల్యే కూడా ఒక మహిళతో మాట్లాడుతున్నానని గుర్తుంచుకుని గౌరవంగా మాట్లాడాలని కోరారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా గౌరవం కావాలా? అని ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. అవినీతి అధికారులతో ఈ భూమిని కబ్జా చేశారని ఎమ్మెల్యే అన్నారు. 

ఎమ్మెల్యే సీరియస్ అయి.. పోలీసులను పిలిచారు. మహిళా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని వైట్ ఫీల్డ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే సదరు మహిళను పోలీసులు వదిలిపెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios