దురద ఎంత తీవ్రంగా ఉందంటే మంత్రి కుర్తా తీసేసి.. అక్కడికక్కడే తన వెంటున్న బాటిల్ నీటితో కడుక్కోవాల్సి వచ్చింది.
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ చేపట్టిన వికాస్ రథయాత్ర మంగళవారం నాడు ఊహించని రీతిలో నిలిచిపోయింది. బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్‌పై ఎవరో దురద పౌడర్ చల్లినట్లు కనిపించింది. మంత్రి అసెంబ్లీ నియోజకవర్గం ముంగవోలిలోని ఓ గ్రామం గుండా యాత్ర వెళుతుండగా ఇది జరిగింది.
దురద ఎంత తీవ్రంగా ఉందంటే మంత్రి అక్కడికక్కడే కుర్తా తీసేసి నీటితో కడుక్కోవాల్సి వచ్చింది. తన దగ్గరున్న బాటిల్ లోని నీటితో మంత్రి కడుక్కోవడం.. అక్కడున్న చాలామంది వీడియోలు తీశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.
రెండు రోజుల క్రితం, ఖాండ్వా జిల్లాలోని ఒక గ్రామం నుండి వెళుతుండగా మరో వికాస్ రథ్ రోడ్డుపై ఇరుక్కుపోయింది. దీంతో యాత్రకు నాయకత్వం వహిస్తున్న స్థానిక బిజెపి ఎమ్మెల్యే దేవేంద్ర వర్మ, మాజీ సర్పంచ్ , గ్రామ పెద్దల మధ్య వాగ్వాదానికి దారితీసింది. వైరల్ గా మారిన ఈ వీడియోలో మాజీ సర్పంచ్ ఎమ్మెల్యేను పట్టుకుని వికాస్ (అభివృద్ధి) యాత్ర అవసరమా? అంటూ కడిగేయడం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వం మూడు కిలోమీటర్ల రహదారిని కూడా మంజూరు చేయలేకపోయిందని ఆరోపించడం కూడా అందులో ఉంది.
ప్రధాని మోదీ పర్యటనకు ముందు.. 1000 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఒక వ్యక్తి అరెస్ట్
"కాంగ్రెసే పార్టీ ఏమీ చేయలేదని అనుకున్నాం.. కానీ బీజేపీ వారైన మీరు అంతకంటే అధ్వాన్నంగా ఉన్నారు. మాకు సరైన రోడ్లు ఇవ్వండి, లేకపోతే మేం మీకు ఓటు వేయం" అని ఆ వ్యక్తి వీడియోలో చెప్పడం కనిపిస్తుంది. మీకు నచ్చకపోతే ఓటు వేయకండి.. అది మీ హక్కు’’ అని ఎమ్మెల్యే బదులిచ్చారు.
వికాస్ యాత్రలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి మంత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్త పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ప్రచారంలో భాగంగా, ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, వివిధ పథకాల లబ్ధిదారులకు చేరవేయాలని యోచిస్తోంది.
