సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ మిత్రపక్షాలతో కలిసి పార్లమెంట్‌‌లో బలంగా ఉంది. మోడీ గాలిలో ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో లోక్‌సభ సమావేశాలలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ప్రతిపక్షనేతలను బీజేపీ నేతలు హేళన చేశారు.

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వెళుతుండగా... బీజేపీ ఎంపీలు ‘‘జైశ్రీరామ్, భారత్ మాతా కీ జై, వందేమాతరం’’ అంటూ నినాదాలు చేశారు.

ప్రొటెమ్ స్పీకర్ వీరేంద్ర కుమార్ సైతం వారిని వారించలేక పోయారు. బీజేపీ నేతల నినాదాల మధ్యే ఆయన నడుచుకుంటూ వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ‘‘జై భీమ్, అల్లాహో అక్బర్’’ అంటూ ప్రతి నినాదాలు చేశారు.

ఒవైసీనే కాకుండా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ షఫీకర్ రహమాన్ బార్క్ ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు కూడా బీజేపీ ఎంపీలు ‘‘జైశ్రీరామ్’’ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా ఆయన ‘‘రాజ్యాంగం జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.

ఎస్పీకే చెందిన హెచ్‌టీ హసన్‌ కు అదే అనుభవం ఎదురవ్వగా ఆయన ‘‘హిందూస్తాన్ జిందాబాద్ ’’ నినదించారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు ప్రమాణం చేసినప్పుడు సైతం ఇలాగే ప్రవర్తించారు.

ఇక యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ హిందీలో ప్రమాణం చేయడంతో ఆమెకు బీజేపీ ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. అంటే ఆమెను విదేశీ వనితగా గుర్తు చేయడమేనంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

పార్లమెంట్‌ కార్యకలాపాల్లో ప్రతిపక్షాలు క్రియాశీలక పాత్ర వహించాలని కోరుకుంటున్నానని ప్రధాని చెప్పిన రోజే బీజేపీ నేతలు ప్రతిపక్ష సభ్యులను అవహేళన చేయడం గమనార్హం.