Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ డబుల్ బొనాంజా.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లు కమలానివే.. రెండు ఎగ్జిట్ పోల్స్‌ల అంచనాలు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించినట్టు రెండు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్‌లలో కమలం పార్టీ అధికారాన్ని నిలుపుకుంటుందని టీవీ9 గుజరాతి, రిపబ్లిక్ టీవీ, పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 
 

bjp may retain gujarat and himachal pradesh says two exit polls
Author
First Published Dec 5, 2022, 6:49 PM IST

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుందని టీవీ9 గుజరాతి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్‌లో బీజేపీ 125 నుంచి 130 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. కాగా, కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందని వివరించింది. హస్తం పార్టీ 40 నుంచి 50 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాగా, కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం చేసినా.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే అని స్పష్టం చేసినా గుజరాత్‌లో మూడో స్థానానికే ఆప్ పరిమితం అవుతుందని టీవీ9 గుజరాతి ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

ఇదిలా ఉండగా, ప్రతిసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్‌లో వస్తున్నది. ఈ సారి బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ప్రజలు అప్పగిస్తారనే కొందరు విశ్లేషణలను రిపబ్లిక్ టీవీ, పీ మార్క్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 34 సీట్ల నుంచి 39 సీట్ల వరకు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ 28 సీట్ల నుంచి 33 సీట్లను కైవసం చేసుకుంటుంది. కాగా, ఇక్కడ ఆప్ బోణీ కొట్టే అవకాశం ఉన్నదని ఈ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు గెలుచుకోవచ్చని అంచనా వేసింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఫలితం వస్తుందోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 27 ఏళ్లుగా గుజరాత్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక, మొదటి విడతలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో సౌరాష్ట్ర, కచ్, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా మొత్తం 39 రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలిపాయి. 89 అసెంబ్లీ స్థానాల బరిలో మొత్తం 788 మంది అభ్యర్థులు నిలిచారు. మొదటి దశలో మొత్తం ఓటింగ్ శాతం 63.14గా నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.

గుజరాత్‌ బీజేపీకి కంచుకోటగా ఉంది. గుజరాత్‌లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్‌, ఆప్‌లు కూడా బీజేపీకి గట్టి పోటీనిస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 12వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ దాదాపుగా 75.6 శాతం ఓటింగ్ నమోదైంది. హిమాచ్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో 412 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో గత 30 ఏళ్లుగా ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్.. ఇలా ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఎన్నికవుతూ వస్తున్నాయి. అయితే ఈసారి ఆ ట్రెండ్‌ను తిప్పికొట్టి.. వరుసగా రెండో సారి హిమాచల్‌లో విజయం సాధించాలని బీజేపీ పట్టుదలతో ప్రచారం చేసింది. మరోవైపు కాంగ్రెస్ ‌కూడా తన మనుగడ కోసం తీవ్రంగానే శ్రమించింది. ఈసారి  కొత్తగా ఆమ్ ఆద్మీ  పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలిచింది.

Follow Us:
Download App:
  • android
  • ios