మాజీ న్యూస్ యాంకర్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సౌధ మణిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్ చూలైమేడులోని సౌధ మణి నివాసంలో ఆమెను అదుపులో తీసుకున్నారు.
మాజీ న్యూస్ యాంకర్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సౌధ మణిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్ చూలైమేడులోని సౌధ మణి నివాసంలో ఆమెను అదుపులో తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం ఆమె షేర్ చేసిన ఓ వివాదస్పద వీడియోకు సంబంధించి పోలీసులు ఈ అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో సౌధ మణి.. ఓ తెలియని వ్యక్తి పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె షేర్ చేసిన వీడియోలో.. ఆక్రమణల తొలగింపునకు కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలను మాత్రమే కూల్చివేశారని, ఆక్రమిత భూముల్లో నిర్మించిన ఇతర మతపరమైన కట్టడాలను తాకకుండా వదిలేశారని ఆ వ్యక్తి ఆరోపించారు.
ఆ పోస్టును సౌధ మణి రీ ట్వీట్ చేశారు. రీట్వీట్ చేయడమే కాకుండా.. “తైరియామా? విద్యలుక్కా?” (తమిళంలో దీని అర్థం.. ధైర్యమా? సూర్యోదయం కోసమా?) అనే మాటలను ఉపయోగించారు. దీంతో పెద్ద సంఖ్యలో ట్విట్టర్ వినియోగదారులు, రాజకీయ నాయకులు ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిపార్ట్‌మెంట్ ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఆమెపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమె ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌధ మణి ముందస్తు బెయిల్ విచారణ సమయంలో ..ఆమె ట్వీట్‌లోని కంటెంట్ ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఉందని మద్రాస్ హైకోర్టు గమనించింది. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన జస్టిస్ ఆర్ పొంగియప్పన్.. తగిన ఫోరమ్ ఇచ్చిన తీర్పును పిటిషనర్ విమర్శించారని, ఈ రకమైన సందేశాలు ఫార్వార్డ్ చేయబడితే ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే శనివారం రోజున సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్ ఆమెను అరెస్ట్ చేసింది. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచి.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇక, ఆమెపై సెక్షన్లు 153 (అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం,) 505(2) (తరగతుల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా దుష్ప్రవర్తనను ప్రోత్సహించే ప్రకటనలను ప్రచారం చేయడం)తో పాటుగా.. ఐపీసీలో ఇతర నిబంధనల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
