ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిరోజాబాద్ జిల్లాలో గత రాత్రి కాల్పులు జరిపి ఓ బిజెపి నేతను హత్య చేశారు. బైకులపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు డికె గుప్తాపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 

మృతుడు మండల ఉపాధ్యక్షుడు. తన దుకాణాన్ని మూసేసి వెళ్తుండగా స్థానిక మార్కెట్ వద్ద ఆయనపై కాల్పులు జరిపారు. సంఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కొంత మంది ఆందోళనకారులు ఆగ్రా రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

బిజెపి నేత హత్య కేసును దర్యాప్తు చేస్తున్నామని, నిరసనకారులతో మాట్లాడామని, వచ్చే 24 గంటల్లో కేసు దర్యాప్తులో ప్రగతి సాధిస్తామని పోలీసు అధికారి చెప్పారు.

దుకాణం మూసేసిన తర్వాత అతనిపై దుండగులు దాడి చేశారని, కుటుంబ సభ్యులు కొంత మంది అనుమానితుల పేర్లు చెప్పారని, దర్యాప్తు సాగించి త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని ఓ పోలీసు అధికారి చెప్పారు.