జమ్మూ అండ్ కాశ్మీర్ బీజేపీ నేత షేక్ వసీం, ఆయన సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న. బుధవారం పొద్దుపోయాక వారు ముగ్గురు పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక దుకాణం బయట కూర్చొని ఉండగా దుండగులు వారిపై కాల్పులు జరిపారు. 

దుండగులు కాల్పులు జరపగానే వారిని తీసుకొని అక్కడి నుండి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మరణించినట్టు బందిపోర జిల్లా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

రాత్రి ప్రధాని నరేంద్రమోడీ ఈ ఘటన గురించి ఫోన్ ద్వారా వాకబు చేసి వసీం కుటుంబానికి సానుభూతిని తెలిపినట్టు మంత్రి జితేంద్ర సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

వసీం బారి, ఆయన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు అమీర్ బషీర్ లపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు మరణించినట్టుగా తెలిపారు. 

ఈ దాడి, వారి మరణాలు, భద్రత వైఫల్యం వల్ల చోటు చేసుకున్నాయని తెలియవస్తుంది. వసీం కి 8మంది సాయుధులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసారు. కానీ ఈ దాడి సమయంలో ఆ సెక్యూరిటీ సిబ్బందిలో ఎవరు కూడా అక్కడ లేకపోవడం అనేక అనుమానాలకు తావు ఇస్తోంది. 

ఆ సెక్యూరిటీ సిబ్బందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు మోటార్ సైకిళ్లపై వచ్చారని, వారంతా రివాల్వర్లతో కాల్పులు జరిపినట్టుగా తెలుస్తయ్హుంది. ముగ్గురికి కూడా తలలో బుల్లెట్లు దిగినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పోలీస్ స్టేషన్ కి పది మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకోవడం విస్మయం కలిగించే విషయం.