గ్వాలియర్‌లో ఓ విషాద ఘటన జరిగింది. బంధువుల పెళ్లి వేడుకలో జరిగిన కాల్పుల్లో బీజేపీ నాయకుడి కుమారుడు మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది. 

మధ్యప్రదేశ్ : సరదాగా చేసిన ఓ పని ఓ మైనర్ బాలుడి ప్రాణాలు తీసింది. అతను స్థానిక బిజెపి నేత కొడుకు కావడంతో మరింత సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో ఓ పెళ్లిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక సందర్భంగా సరదాగా కాల్పులు జరిపారు. వివరాలలోకి వెళితే.. గోరియలోని లక్ష్మీ గంజిలో శనివారం రాత్రి బీజేపీ నేతకు సంబంధించిన బంధువుల వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు బిజెపి నేత భరత్ యాదవ్ కుమారుడు ప్రియాన్షు (15) వెళ్ళాడు.

వివాహ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. వేడుకలు పూర్తయిన తర్వాత పెళ్లికి హాజరైన బంధువులు ఒకరైన రాజేష్ యాదవ్.. తన దగ్గరున్న సర్వీస్ రివాల్వర్ బయటికి తీసి గాల్లో కాసేపు ఊపాడు.. ఆ తర్వాత కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే బుల్లెట్ అదుపుతప్పి ప్రియాన్షు కడుపులోకి దూసుకుపోయింది. ఏమైందో అర్థం అయ్యేలోపే ప్రియాన్షు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన బంధువులు వెంటనే ప్రియాన్షును దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా నిర్ధారించారు.

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ అరెస్టుపై తల్లి ఫస్ట్ రియాక్షన్.. ‘ఒక వీరుడిలా లొంగిపోయాడు’

కాల్పుల విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన నిందితుడు రాజేష్ యాదవ్ పై కేసు నమోదు చేశారు. కాగా, ప్రియాన్షు మృతి చెందగానే.. భయపడిన రాజేష్ యాదవ్ పరారయ్యాడు. ప్రియాన్షు మృతదేహానికి ఆసుపత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రియాన్షు తండ్రి భరత్ యాదవ్ ప్రస్తుతం బిజెపి కార్పొరేటర్ గా పనిచేస్తున్నారు. చేతికందివచ్చిన కొడుకు అంతలోనే.. అనుకోకుండా మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటుతున్నాయి.