ఘటన జరిగిన తర్వాత భరత్ అతడి మిత్రులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

మోతాదుకి మించి మద్యం తాగి.. ఆ పైన వాహనం నడిపి ఇద్దరి ప్రాణాలు బలిగొన్నాడు ఓ బీజేపీ నేత కుమారుడు. ఈ సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. నిద్రపోతున్న కార్మికుల మీదకు కారు దూసుకుపోవడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.

నిందితుడిని స్థానిక బీజేపీ కిసాన్ మోర్చా నేత బద్రి నారాయణ మీనా కుమారుడు భరత్ భూషణ్‌ మీనా (35)గా గుర్తించారు. భరత్‌తో పాటు అతడి మిత్రులంతా అధికమొత్తంలో మద్యం సేవించినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత భరత్ అతడి మిత్రులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

తొలుత గాంధీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ కింద పేవ్‌మెంట్‌ను ఢీకొట్టిన నిందితులు.. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భరత్ తన కారుపై నియంత్రణ కోల్పోవడంతో కారు అమాంతం ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను ఆస్పత్రిలో చేర్పించామనీ.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. భరత్‌పై హత్యాయత్నం, మద్యం సేవించి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.