సోషల్ మీడియాపై కఠిన నిబంధనలు తీసుకొచ్చిన కేరళ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ నేత, ప్రకాష్ జవదేకర్. కేరళలో ప్రస్తుతం ఎమర్జెన్సీ తరహా పరిస్ధితి వుందని.. బీజేపీ దీనిని చూస్తూ మౌనంగా వుండదన్నారు.  

పిల్లలను తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వం శనివారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. వివిధ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లలో ఉద్దేశపూర్వకంగా విద్యార్ధులను ప్రభావితం చేయడానికి అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోప్ట్ చేస్తున్నారని కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి అన్నారు.

తద్వారా పిల్లల మనసులను కలుషితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. యువతరాన్ని తప్పుడు మార్గం వైపు నడిపించడమే ఇలాంటి వారి లక్ష్యమని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని శివన్ కుట్టి కోరారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో అలాంటి ప్రోగ్రామ్‌లను, కంటెంట్‌ను నిషేధించడానికి ఇప్పటికే సమయం మించిపోయిందని మంత్రి పేర్కొన్నారు. దీని వల్ల పిల్లలే కాదు, యువతను , మొత్తం సమాజాన్ని పాడు చేస్తున్నారని శివన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటీవల మలప్పురం జిల్లాలో ఒక దుకాణం ప్రారంభోత్సవం సందర్భంగా అత్యంత రద్దీగా వుండే రహదారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ఓ యూట్యూబర్. అతని కారణంగా ట్రాఫిక్‌ సైతం నిలిచిపోయింది . ఈ క్రమంలో శివన్ కుట్టి చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున కొచ్చిలోని తన ఇంటి నుంచి సదరు యూట్యూబర్‌ను అరెస్ట్ చేశారు. అభ్యంతకరమైన వ్యాఖ్యలు, కంటెంట్‌తో కూడిన అతని యూట్యూబ్ ఛానెల్‌లో లక్షలాది మంది సభ్యులు , ముఖ్యంగా పిల్లలు సబ్‌స్క్రైబర్లుగా వున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అతనిపై కేసు నమోదు చేసినట్లు శివన్ కుట్టి తెలిపారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. 

భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో పిల్లలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న ఒక వర్గం చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని శివన్ కుట్టి స్పష్టం చేశారు. అటువంటి ప్రచారకర్తలపై సాధ్యమయ్యే అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా సాధారణ విద్యాశాఖపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపైనా చర్యలు తీసుకుంటామని శివన్ కుట్టి హెచ్చరించారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ మండిపడ్డారు. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం భ్రమలో వుందని.. తమను విమర్శించే మీడియాపై వేటు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేరళలో అత్యవసర పరిస్ధితి నెలకొని వుందని జవదేవకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన అత్యవసర పరిస్ధితిని వ్యతిరేకించిన సీపీఎం.. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పనినే చేస్తోందని విమర్శించారు. పాట్నాలో మిగిలిన సమావేశం ఇప్పుడు జరుగుతోందని, కేరళ ప్రజలను మోసం చేసేందుకు శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని, కేరళ ప్రజలు దీనిని గుర్తిస్తారని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. 

Scroll to load tweet…