జార్ఖండ్‌లో పట్టపగలే ఓ బీజేపీ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు

జార్ఖండ్‌లో పట్టపగలే ఓ బీజేపీ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ధన్‌బాద్‌లోని బీజేపీ నగర ఉపాధ్యక్షుడు సతీశ్ సింగ్ బాక్‌మోర్‌లో కారు దిగి చరవాణిలో మాట్లాడుతూ , నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఈ క్రమంలో ముఖానికి మాస్కులు కట్టుకున్న ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఆయన్ను అనుసరించారు. ఎవరో వెనుక వస్తున్నట్లు గుర్తించిన సతీశ్ సింగ్ తిరిగి చూసేసరికి దుండగులు ఆయన తలపై కాల్చి పరారయ్యారు.

వెంటనే స్పందించిన స్థానికులు సతీశ్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై స్పందించిన మృతుడి సన్నిహితుడు, స్థానిక ఎమ్మెల్యే ఇది రాజకీయ హత్యేనని ఆరోపించారు.