గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఈ సారి కూడా బీజేపీదే విజయమని, ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపబోదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు గతంలో ఎదురైన అనుభవమే మళ్లీ ఎదురవుతుందని అన్నారు. 

ఈ సారి గుజ‌రాత్, హిమాచల్ ప్రదేశ్ లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ బీజేపీయే గెలుస్తుంద‌ని, అధికారం చేప‌డుతుంద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ఏక‌ప‌క్షంగా విజ‌యం సాధిస్తుంద‌ని తెలిపారు. ఇటీవ‌ల అహ్మదాబాద్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కులు భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ లు ప‌ర్య‌టించారు. త‌మ పార్టీకి ఈ ఒక్క సారి అధికారం ఇచ్చి చూడాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ నేప‌థ్యంలో అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన నాయకుడిగా పిలుస్తార‌ని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయన పేరు మీద‌నే బీజేపీకి ఏక‌ప‌క్షంగా ఓట్లు వ‌స్తాయ‌ని తెలిపారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. గ‌తంలో కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారని గుర్తు చేశారు.

‘‘ కేజ్రీవాల్ మోడీపై ఇంతకు ముందు పోటీ చేశారు. అక్క‌డ ఆయ‌న ప‌రిస్థితి అంద‌రూ చూశారు. అలాగే ఆయ‌న ఉత్తరప్రదేశ్‌లో ఒక సీటు కూడా గెలవలేకపోయాడు. ఉత్తరాఖండ్, గోవాలో కేజ్రీవాల్ పరిస్థితి చూశారా ? కొన్నిసార్లు వారు మీడియా ద్వారా హైప్ క్రియేట్ చేశారు. కానీ ఫీల్డ్ లో అలాంటేదీ లేదు. ” అని బీజేపీ ఠాకూర్ ఆరోపించారు. 

2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై వారణాసి నుంచి పోటీచేశారు. అదే స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎంపీగా పోటీ చేశారు. అయితే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కేజ్రీవాల్ పై 3.7 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది చివ‌రిలో న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయిన గుజ‌రాత్ అలాగే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో తిరంగా యాత్ర నిర్వహించారు. అంత‌కు ముందు సబర్మతీ ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి అవ‌కాశం ఇవ్వాల‌ని, ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాల‌ని కోరారు. 

2021 ఫిబ్రవరిలో సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (SMC) ఎన్నికలలో బీజేపీ 93 స్థానాలు గెలుచుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో గుజ‌రాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ బ‌లంగా ఎద‌గాల‌ని భావిస్తోంది. అందులో భాగంగానే శ‌నివారం గుజ‌రాత్ లో ఆప్ నేత‌లు ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అర‌వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ ఈరోజు నేను ఏ పార్టీని విమర్శించడానికి రాలేదు. బీజేపీని, కాంగ్రెస్‌ని ఓడించడానికి రాలేదు. గుజరాత్‌ను, గుజరాతీలను గెలిపించేందుకు వచ్చాను. పంజాబ్‌, ఢిల్లీ ప్రజలు చేసినట్లే ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆప్‌కి ఒక్క అవకాశం ఇవ్వండి. మా ఐదేళ్ల పనిలో మీరు మమ్మల్ని ఇష్టపడకపోతే మళ్లీ మీరు ఎలాగైనా వీరినే (బీజేపీని) అధికారంలోకి తీసుకురావచ్చు ’’ అని అన్నారు.