Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్‌లో ఘన విజయం దిశగా బీజేపీ.. పనిచేసిన మోదీ మేనియా.. కలిసొచ్చిన అంశాలు ఇవే..!

గుజరాత్‌‌ తమ అడ్డా అని బీజేపీ మరోసారి నిరూపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో రికార్డు విజయం దిశగా దూసుకుపోతుంది. ఏడోసారి కూడా గుజరాత్ పీఠం దక్కించుకోబోతుంది.

BJP Heads To Grand Victory in Gujarat and Here is the key factors in Saffron party getting huge seats
Author
First Published Dec 8, 2022, 12:29 PM IST

గుజరాత్‌‌ తమ అడ్డా అని బీజేపీ మరోసారి నిరూపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో రికార్డు విజయం దిశగా దూసుకుపోతుంది. ఏడోసారి కూడా గుజరాత్ పీఠం దక్కించుకోబోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి సీట్లతో.. రికార్డు విక్టరీ సాధించబోతుంది. అయితే బీజేపీ ఘన విజయానికి కలిసివచ్చిన విషయాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. గుజరాత్‌లో పూర్తిగా మోదీ, అమిత్ షా మేనియా.. వాళ్లు రచించిన ప్రణాళికలు కాషాయ పార్టీ విజయంలో కీలక భూమిక పోషించాయి. రాష్ట్రంలో బీజేపీ నేతల పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై విశ్వాసంతోనే తాము బీజేపీకి ఓటు వేశామని గుజరాత్‌ వాసులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా హిందూత్వ అజెండా బీజేపీ కలిసి వచ్చి.. భారీ విజయాన్ని కట్టబెట్టిందనే చెప్పాలి. 

మరోవైపు గుజరాత్‌లో బీజేపీని ధీటుగా బలమైన ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందని చెప్పాలి. అలాగే బీజేపీకి రెబల్స్ బెడద ఉన్నప్పటికీ.. అమిత్ షా రచించిన వ్యుహాలు పార్టీ విజయంలో తోడ్పడ్డాయి. ఓటర్లు కూడా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీలను కూడా ఓటర్లు నమ్మలేదని తెలుస్తోంది. ఆప్ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌కు వచ్చి హిందూత్వ జపం చేసిన, హామీల వర్షం కురిపించిన పెద్ద సంఖ్యలో ఓటర్లు ఆయన వారి నేతగా భావించలేదు. 

అలాగే ప్రభుత్వం వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య చీలడం కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది. కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటూ వచ్చిన మైనారిటీలు కూడా.. కొన్ని చోట్ల అభ్యర్థులను నిలిపిన ఎంఐఎంకు మద్దతుగా ఓట్లు వేశారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కనీసం పోటీలో కూడా లేకుండా పోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాలను దక్కించుంది. ఆ సమయంలో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు కనీసం 20 స్థానాల్లో కూడా విజయం సాధించే పరిస్థితి కనిపించడం లేదు. 

ఫలించిన బీజేపీ వ్యుహాలు.. 
-ప్రజాకర్షణ లేని రాష్ట్ర నాయకత్వం కారణంగా అధికార వ్యతిరేకత పెరగిందని భావించిన బీజేపీ అధిష్టానం.. ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేసి భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిని చేసింది.

-గుజరాత్‌లో గెలుపు కోసం కొన్ని నెలల కిందటి నుంచే బీజేపీ వ్యుహాలను పదును పెట్టింది. హిందూత్వ కార్డును బలంగా ప్రజల్లోకి తీసుకెళింది. ఈ విషయంలో బీజేపీ ముఖ్య నేతలు కొందరు కీలకంగా వ్యవహరించారు. 

-కేంద్ర హోంమంత్రి, బీజేపీ గుజరాత్ ప్రచార సారథి అమిత్ షా.. ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల పంపిణీ తర్వాత, దశాబ్దాలుగా పదవులు అనుభవిస్తున్న నేతలు యువతకు బాటలు వేయాలంటే పదవీ విరమణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది. కొన్నిచోట్ల నేతలకు పార్టీ క్యాడర్ నుంచి, ప్రజల నుంచి ఉన్న వ్యతిరేకత ఉన్నకారణంగానే తొలగించింది. అధికార వ్యతిరేకత కారణంగా  కొత్తవారికి అవకాశం కల్పించింది. 

-అయితే పార్టీలోని అసంతృప్త నేతలతో అమిత్ షా నిరంతరం టచ్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు.. రెండో దశ పోలింగ్‌కు ముందు రోజు అంటే డిసెంబర్ 4న గాంధీనగర్‌లోని బీజేపీ కార్యాలయమైన కీలకమైన మంతనాలు జరిపారు. 

- బీజేపీ బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన 17 మందికి టికెట్లను కేటాయించింది. అలా టికెట్లు పొందిన వారిలో గత ఐదేళ్ల కాల వ్యవధిలో బీజేపీలో చేరిన 11 మంది సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కూడా ఉన్నారు.

-2017లో జరిగిన ఎన్నికల సమయంలో హార్దిక్ పటేల్, పాటిదార్ అనామత్ ఆందోలన్ సమితి నేతృత్వంలోని పాటిదార్ రిజర్వేషన్ ప్రకంపనలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలోనే బీజేపీ 99 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఆ ఉద్యమం తీవ్ర స్థాయిలో లేకపోవడం.. రాజకీయాల్లోకి వచ్చిన హార్దిక్ పటేల్ కొన్ని నెలల క్రితం హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి.. కాషాయ పార్టీలో చేరడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చింది.  

-బీజేపీ టికెట్ దక్కకపోవడంతో దాదాపు 12 మంది రెబల్స్‌గా మారి.. ఎన్నికల బరిలో నిలిచారు..దీంతో బీజేపీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, హోం మంత్రి హర్ష్ సంఘవిని రాష్ట్రమంతా పర్యటించి అసంతృప్తితో ఉన్న పార్టీ నాయకులను కలవడంతో పాటు, ప్రభుత్వ సంస్థల్లో లాభదాయకమైన పదవుల వాగ్దానాలతో వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు.

- ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ మేనియా పనిచేసిందనే మాట వినిపిస్తుంది. సొంత రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొవడంతో.. ఈసారి అలాంటి పోటీ ఎదుర్కొకుండా మోదీ తీవ్రంగానే శ్రమించారు. గుజరాత్‌లో అభివృద్దిని పరుగులు పెట్టించడం, కేంద్రం నుంచి నిధుల కేటాయించారు. ఎన్నికల సమయంలో కూడా విస్తృతంగా పర్యటించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios