మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం అమ్మకానికి ఉందని ఆ పార్టీ నిరూపించిందని అన్నారు. కానీ దీనిపై ప్రజలు పోరాటం చేస్తారని తెలిపారు.
మహారాష్ట్ర కొనసాగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై, రేపు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం అమ్మకానికి ఉందని బీజేపీ స్పష్టం చేసింది. ఎవరైనా వచ్చి డబ్బు తీసుకోవచ్చు, వారు బీజేపీలో చేరవచ్చు. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యం విధి. కానీ భారతదేశ ప్రజలు దీనిపై పోరాడతారు’’ అని వేణుగోపాల్ నొక్కి చెప్పారు.
ఇటీవల మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. శివసేన పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. ఆ పార్టీలోని దాదాపు 39 మంది రెబల్ ఎమ్మెల్యేలుగా మారారు. వారికి మంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వం వహించారు. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ముప్పు తలెత్తింది. బుధవారం మహారాష్ట్ర కొత్త సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిని దేవేంద్ర ఫడ్నవీస్ చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది.
కసబ్‌కు కూడా అంత సెక్యూరిటీ లేదు.. రెబల్ శివసేన ఎమ్మెల్యేలపై ఆదిత్య ఠాక్రే కౌంటర్
288 మంది సభ్యుల సభలో షిండే నేతృత్వంలోని బృందానికి 10 మంది చిన్న పార్టీలు సభ్యులు, అలాగే ఇండిపెండెంట్లతో పాటు బీజేపీకి చెందిన 106 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన శాసన సభ ప్రత్యేక సమావేశాల్లో బీజేపీకి చెందిన రాహుల్ నార్వేకర్ నేడు స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆయనకు 164 ఓట్లు రాగా, శివసేన నుంచి ఎంవీఏ తరుఫున పోటీలో ఉన్న రాజన్ సాల్వీకి 107 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రాజ్ ఠాక్రేకు చెందిన MNS (మహారాష్ట్ర నవ నిర్మాణ సేన) పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్‌కు మద్దతు ఇవ్వగా, ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అబూ అజ్మీ, రైస్ షేక్ ఓటింగ్‌లో అసలు ఓటింగ్ లోనే పాల్గొనలేదు.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఎవరో తెలుసా?
రెండో రోజు సమావేశాల్లో అంటే సోమవారం నాడు షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం సునాయాసంగా ఓటింగ్ లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఈ బల పరీక్ష పూర్తయిన అనంతరం త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా.. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఏక్ నాథ్ షిండే ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడారని కారణాన్ని పేర్కొన్నాడు. షిండే స్వచ్చందంగా తన పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారని, అందువల్ల శివసేన పార్టీ అధ్యక్షుడిగా నాకు లభించిన అధికారాలను ఉపయోగించి ఆయనను తొలగిస్తున్నానని లేఖలో తెలిపారు.
