Jaipur: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ అన్నారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లోని పిలిబంగాలోని పాత పాడి మార్కెట్‌లో జరిగిన కిసాన్ జనసభలో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
Rajasthan Former Deputy Chief Minister Congress: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై మరోసారి రాజస్థాన్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని మండిపడింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే బీజేపీ హామీలు గాలిమూటలుగానే మిగిలాయని విమర్శించింది. రైతులకు మేలు చేయడం మరిచి.. వారికి వ్యతిరేకంగా వివాదాస్పత మూడు వ్యవసాయ చట్టాలను బీజేపీ సర్కారు తీసుకువచ్చిందని విమర్శించింది.
వివరాల్లోకెళ్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని సచిన్ పైలట్ అన్నారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లోని పిలిబంగాలోని పాత పాడి మార్కెట్‌లో జరిగిన కిసాన్ జనసభలో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడైన సచిన్ పైలట్ పిలిబంగాకు చేరుకున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కార్యాలయ బేరర్ల నుండి ఘన స్వాగతం లభించింది. అక్కడి పాత పాడి మార్కెట్‌లో జరిగిన కిసాన్ జనసభలో సచిన్ పైలట్ రైతుల సంక్షేమం గురించి సుదీర్ఘంగా ప్రసంగిస్తూ, రైతులకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.
‘‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.. ఆ హామీ ఏమైంది?.. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు.. చట్టాలను అమలు చేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వాటిని రద్దు చేశారు. డీజిల్, పెట్రోలు ధరలు సైతం రైతుల వెన్ను విరిచాయి’’ అని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. పంటల కొనుగోళ్లకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సచిన్ పైలట్ తెలిపారు. "దేశానికి తిండి పెట్టే వ్యక్తికి గౌరవం లేకపోతే దేశంపై గౌరవం ఉండదు.. రైతుల జీవితాలు బాగు చేస్తానని ప్రతిజ్ఞ చేయాల్సిందే.. జైపూర్‌కు వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడి పంట నష్టపోయిన రైతులకు పరిహారంఇవ్వాలి" అని కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు.
యువతకు ఉపాధి..
తన ప్రసంగంలో సచిన్ పైలట్ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. ఒక్కోసారి ప్రశ్నాపత్రాలు లీక్ అవుతాయి, కొన్నిసార్లు పరీక్షలు రద్దవుతున్నాయి. ప్రిపరేషన్ తీసుకుంటున్నవారు, పరీక్షకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం బాధ్యతగా నిర్ణయించి దోషులను జైలుకు పంపాలని అన్నారు.
భారత్ జోడో యాత్రపై ప్రశంసలు..
రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగుతున్న భారత్ జోడో యాత్రపై సచిన్ పైలట్ ప్రశంసలు కురిపించారు. "రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఒక చారిత్రాత్మక ప్రయాణం. ఈ ప్రయాణం ద్వారా రాహుల్ గాంధీ ప్రతి బ్లాక్, ప్రతి గ్రామం-ప్రతి జిల్లాలో ప్రతి వ్యక్తితో కనెక్ట్ అయ్యారు" అని పైలట్ చెప్పారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో ఉన్నప్పుడు, పైలట్ నాయకత్వంపై 2020లో తిరుగుబాటు చేసినప్పటి నుండి ఇద్దరు నాయకుల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతను తొలగించడానికి సచిన్ పైలట్-రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో సన్నిహిత సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ .. త్వరలో శుభవార్త వస్తుందని చెప్పారు.
రాజస్థాన్‌లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం..
రాజస్థాన్‌లో కాంగ్రెస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సచిన్ పైలట్ అన్నారు. ఢిల్లీలో షీలా దీక్షిత్ మూడుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనీ, ఇక్కడి ప్రజల మద్దతుతో రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. కాగా, రాజస్థాన్ శాసనసభలోని 200 సీట్లలో కాంగ్రెస్‌కు 109 సీట్లు ఉండగా, బీజేపీకి 71 సీట్లు వచ్చాయి. రాజస్థాన్‌లో ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి.
