తాజాగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ స్లాబ్ రేట్ల సవరణపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని ఆరోపించారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అధిక పన్నులు, నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. అందులో పెరుగు, పనీర్, బియ్యం, గోధుమలు, బార్లీ, బెల్లం, తేనె వంటి వస్తువులపై ఇప్పుడు ఎలా పన్ను విధిస్తున్నారో చూపించే గ్రాఫ్‌ను ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఇంతకు ముందు ఇలా అధిక జనాభా ఉపయోగించే వస్తువులపై పన్ను లేదని చెప్పారు. ‘‘ అధిక పన్నులు.. ఉద్యోగాలు లేవు. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్న దానిని ఎలా నాశనం చేయాలనే దానిపై బీజేపీయే మాస్టర్ క్లాస్ ’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
రూ. 5,000 వసూలు చేసే హాస్పిటల్ గదులపై 5 శాతం పన్ను విధింపు విధానం, రూ. 1,000 కంటే తక్కువ ఉన్న హోటల్ గదులకు GST స్లాబ్ లో 12 శాతం పన్ను ఎలా విధిస్తున్నారనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ షేర్ చేశారు. సోలార్ వాటర్ హీటర్లపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి, ఎల్‌ఈడీ ల్యాంప్‌లు, లైట్లపై 12 శాతం నుంచి 18 శాతానికి పెంచినట్లు గాంధీ తెలిపారు. ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీని పెంచడంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది.
కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అదొక్కటే మార్గం.. : మెహబూబా ముఫ్తీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ తన 47వ సమావేశంలో నిర్ణయించిన స్లాబ్ రేట్లను సవరించింది. దీని ప్రకారం సోమవారం నుంచి రూ. 5,000 కంటే ఎక్కువ అద్దె ఉన్న ఆసుపత్రి గదులతో పాటు, ముందుగా ప్యాక్ చేసిన, ఆటా, పనీర్, పెరుగు వంటి లేబుల్ ఆహార పదార్థాలపై కస్టమర్లు 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రోజుకు రూ. 1,000 వరకు అద్దె ఉన్న ఉన్న హోటల్ గదులు, మ్యాప్‌లు, చార్టులు, అట్లాస్‌లతో పాటు పలు వస్తులపై 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే టెట్రా ప్యాక్‌లపై 18 శాతం జీఎస్టీ అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
జీఎస్టీ స్లాబుల సవరణపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు. దీనిని ఆయన ఉత్కంఠభరితమైన బాధ్యతారాహిత్యం అని అభివర్ణించారు. “ ఎంతో మంది భారతీయులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈ జీఎస్టీ రేట్ల పెంపు ఉత్కంఠభరితమైన బాధ్యతారహితమైనది. ద్రవ్యోల్బణం ఆయన సంపాదనను తినేస్తున్నప్పటికీ ఆమ్ ఆద్మీ భారాన్ని మోస్తుంది. ఈ ప్రభుత్వం దేనినైనా తప్పించుకోగలదని నమ్ముతోందా? ’’ అని ఆయన అన్నారు.
