నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల 2023కి సుమారు 10 రోజుల ముందు.. కాంగ్రెస్ రాష్ట్రంలోని అనేక అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీని లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆర్టికల్ 371ఏ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే.. నాగాలాండ్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం,ఆర్టికల్ 371Aని ఉటంకిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు. 

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ కు కేవలం పదిరోజుల సమయం మాత్రమే ఉండటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ గురువారం నాడు నాగాలాండ్ రాజధాని కొహిమాలో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన విధంగానే బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 371Aని కూడా రద్దు చేయగలదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగా రాజకీయ సమస్య పరిష్కారానికి ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేయడం తమ పార్టీ ప్రభుత్వాల నేతృత్వంలో సంవత్సరాల తరబడి జరిగిన చర్చల ఫలితమేనని, అయితే ఎవరికీ వివరాలు తెలియవని అన్నారు. పొంతన లేని వాగ్దానాలు చేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వం గురించి మాట్లాడే వారికి మార్గం చూపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ మాట్లాడుతూ.. "ఆగస్టు 3, 2015 న, నాగా సమస్యను పరిష్కరించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దానిని అందరూ స్వాగతించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాగాలాండ్‌లో శాంతి, సామాజిక సామరస్యం, అభివృద్ధిని కోరుకుంటుంది, అయితే ఎనిమిదేళ్లు గడిచిపోయాయి, ఇంకా ఒప్పందం ఏమిటనే వివరాల కోసం మేము ఎదురుచూస్తున్నాము. 1990ల మధ్యకాలం నుండి నాగా గ్రూపుల నాయకులతో కాంగ్రెస్ సంవత్సరాల రాజకీయ అనుబంధం ఆధారంగా ఎట్టకేలకు 2015లో ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కుదిరింది," అని ఆయన అన్నారు.

'ఆర్టికల్ 370ని రద్దు చేయగల ప్రభుత్వం ఆర్టికల్ 371Aని కూడా రద్దు చేయగలదు...'

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిందని జైరాం రమేష్ అన్నారు. 370ని రద్దు చేయగల ప్రభుత్వం నాగాలాండ్‌కు కొన్ని ప్రత్యేక నిబంధనలను అందించే ఆర్టికల్ 371Aని కూడా రద్దు చేయవచ్చనీ, కాంగ్రెస్ నాగాలాండ్‌ను సృష్టించి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే, పరిరక్షించే, ప్రోత్సహించే రాజ్యాంగంలో ఆర్టికల్ 371A ను ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో అవినీతి పెరిగిపోయి.. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ‌ కీలక పాత్ర పోషించి.. ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. నాగాలాండ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 60 మంది సభ్యుల అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా, మార్చి 2న త్రిపుర, మేఘాలయలతో పాటు ఓట్ల లెక్కింపు జరగనుంది.