ఎమ్మెల్యేల అనర్హత కారణంగా కర్ణాటకలో ఉపఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనర్హత వేటుపడిన శాసనసభ్యుల్లో 13 మందికి బీజేపీ టికెట్లు కేటాయించింది.

మొత్తం 15 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతుండగా అందులో 13 మందితో కూడిన అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విడుదల చేశారు.

అంతకుముందు అనర్హత వేటుపడిన 17 మంది కాంగ్రెస్-జేడీఎష్ మాజీ ఎమ్మెల్యేల్లో 16 మంది గురువారం యడ్డీ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు.

Also Read:కర్ణాటక ఉప ఎన్నికలు: బీజేపీలోకి అనర్హత ఎమ్మెల్యేలు..

దీంతో సభాపతి నిర్ణయంపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించడంతో వారు ఊరట చెందారు.

17 స్థానాల్లోని రెండు చోట్ల సాంకేతిక కారణాల వల్ల ఎన్నిక వాయిదా పడగా.. 15 స్థానాల్లో యథావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటిలో 6 స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తేనే అధికారంలో కొనసాగే అవకాశం ఉంటుంది. దీంతో ఆ పార్టీకి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. 

Also Read:ఊరట: అనర్హత సమర్ధన, ఎన్నికల్లో పోటీకి ఎమ్మెల్యేలకు ఛాన్సిచ్చిన సుప్రీం

తామంతా గురువారం బీజేపీలో చేరుతున్నట్లు 17మంది అనర్హత ఎమ్మెల్యేలు చెప్పారు. ఢిల్లీలో ఈ విషయాన్ని వారు ప్రకటించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ భేటిలోనూ వారి రాకను  స్వాగతిస్తూ తీర్మానించారు. 

17మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్ పై బుధవారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పు అనర్హత ఎమ్మెల్యేలకు అనుకూలంగా రావడం గమనార్హం. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

సుప్రీం తీర్పు అనంతరం  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ, 17 మంది అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో పోటీ చేయవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు.

ఉపఎన్నికలు జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో రేపటి నుంచి తాము పర్యటిస్తామని తెలిపారు. ఈ 17 స్థానాలను బీజేపీ నూటికి నూటొక్క శాతం గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

బలనిరూపణలో కాంగ్రెస్-జేడీఎస్ విఫలమవ్వడంతో బీజేపీ నేత యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.