ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఉన్నావ్‌ బాధితురాలి హత్యాయత్నం కేసులో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ పై బహిష్కరణ వేటు వేసింది.  

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. హత్యాయత్నం ఘటనలో ప్రతిపక్షాలు బీజేపీపై నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆయన బహిష్కరణకు గురవడం గమనార్హం.
 
బాధితురాలు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉన్నావ్‌ అత్యాచార ఘటన మరోసారి తెరమీదకు వచ్చింది. కుల్ దీప్ సెంగర్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన బాధితురాలి కారును రాయ్‌బరేలీలో జులై 28న ఒక లారీ బలంగా ఢీకొంది. 

ఈ ప్రమాదంలో బాధితురాలి పిన్ని, అత్త చనిపోయారు. బాధితురాలి తరపు న్యాయవాది ప్రస్తుతం లైఫ్ సపోర్టుపై ఉన్నారు. ఈ కేసుపై విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి.నిందితుడు సెంగార్‌, అతడి బంధువులు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఉన్నావ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ నంబర్‌ ప్లేట్‌ మీద నలుపు రంగు పెయింట్‌ వేయడం ఈ ఆరోపణలకు ఆజ్యం పోసింది. ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా దాఖలు కాగా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 

మరోవైపు ఉన్నావ్ బాధితురాలికి రక్షణగా ముగ్గురు పోలీసులను ప్రభుత్వం నియమించింది. ముగ్గురు పోలీసులు ఉన్నా ప్రమాదం నుంచి ఆమెను కాపాడకపోవడంతో వారిని సస్పెండ్ చేసింది.