శారదా కుంభకోణం కేసులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర ఏజెన్సీలు విచారణ జరిపించాలని బీజేపీ నాయకుడు సువేందు అధికారి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి అభిషేక్ బెనర్జీని ఏజెన్సీ ముందు హాజరుకావాలని సీబీఐ మంగళవారం కోరింది. ఈ తరుణంలో ఈ డిమాండ్ తెర మీదికి వచ్చింది.
మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఇప్పటికే టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో పీకల లోతు కష్టాలను ఎదుర్కొంటుంటే.. మరోసారి శారదా కుంభకోణం తెర మీదికి వచ్చింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత శుభేందు అధికారి ఈ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రిపై కేంద్ర ఏజెన్సీలు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సువేందు అధికారి మాట్లాడుతూ.. సిబిఐ చాలా చక్కగా, చురుకైన పని చేస్తోందనీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు లేనప్పటికీ, ఏజెన్సీ సత్వర పని చేస్తోందని అన్నారు. అభిషేక్ బెనర్జీపై అనేక కేసులు నడుస్తున్నాయని అన్నారు. మమత, అభిషేక్ బెనర్జీ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఏజెన్సీలను కోరుతున్నానని అన్నారు. శారదా స్కామ్ కింద మమతపై దర్యాప్తు చేయడానికి సీబీఐకి తగిన సాక్ష్యాలు ఉన్నాయనీ, కానీ అది దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. ఎక్సైజ్ పాలసీ కేసుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించవచ్చు, మమత ఎందుకు ప్రశ్నించలేదు? అని అధికారి ప్రశ్నించారు.
అదే విధంగా.. అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా, అతని కుటుంబ సభ్యుల ప్రమేయానికి సంబంధించి చాలా సాక్ష్యాలు ఉన్నాయనీ, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బెంగాల్ ప్రజలు అడుగుతున్నారని, ఈ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. తాను అబద్ధాలు చెబుతున్నట్లయితే.. అతను (అభిషేక్ బెనర్జీ) తనపై ఎందుకు పరువు నష్టం కేసు పెట్టడం లేదని అన్నారు. టిఎంసి నాయకుడు ముకుల్ రాయ్ బిజెపిలో చేరడంపై ఊహాగానాల గురించి అడిగినప్పుడు.. పార్టీకి అలాంటి వ్యక్తులు అవసరం లేదని అధికారి సూటిగా చెప్పారు. ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయ నియామక స్కామ్‌కు సంబంధించి టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని ఏజెన్సీ ముందు హాజరుకావాలని సీబీఐ మంగళవారం కోరింది.
