న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా మరో కొత్తవాదన తెరపైకి తీసుకువచ్చారు. ఒకేదేశం-ఒకే రాజ్యాంగం నినాదం సక్సెస్ కావడంతో ఒకే దేశం ఒకే గుర్తింపు కార్డు అంటూ మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 

అన్ని అవసరాలకు ఉపయోగపడేలా దేశమంతా ఒకే గుర్తింపు కార్డు తీసుకువచ్చే యోచనలో ఉన్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఆధార్, పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఇలా అన్ని అవసరాలకు ఒకే గుర్తింపు కార్డు అవసరమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

అది సాధ్యమవుతుంది కూడా అని చెప్పుకొచ్చారు. బహుళ ప్రయోజన గుర్తింపు కార్డుగా దాన్ని వినియోగిస్తే బాగుంటుందని సూత్రప్రాయంగా అమిత్ షా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 2021 జనాభా లెక్కింపు గురించి కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి జనగణనను డిజిటల్ రూపంలో చేపట్టనున్నట్లు తెలిపారు. 

అందుకోసం ప్రత్యేకంగా మెుబైల్ యాప్ కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. 2021 జనాభా లెక్కింపులో మెుబైల్ యాప్ ను వినియోగించడంతోపాటు తొలిసారిగా జాతీయ జనాభా రిజిస్టర్ ను కూడా తయారు చేయనున్నట్లు తెలిపారు. ఒక  వ్యక్తి చనిపోతే ఆ డేటా ఆటోమేటిక్ గా అప్ డేట్ అయ్యే వ్యవస్థను తీసుకురానున్నట్లు షా స్పష్టం చేశారు.