కరోనా వ్యాప్తిని అరికట్టేందకు కేంద్రం విధించిన లాక్‌డౌన్ పొడగింపు గురించి ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ జాతి ఉద్ధేశించి ప్రసంగించే కొద్ది గంటలకు ముందు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

తమ పార్టీ అధికారంలో లేనప్పటికీ.. కోవిడ్-19పై పోరాటంలో ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందంటూ పేర్కొన్నారు. ప్రజలు అందరూ సహకరిస్తేనే.. ఈ పోరాటంలో విజయం సాధించవచ్చని సోనియా తన ప్రసంగంలో అన్నారు. 

అంతేకాక.. ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇంట్లోనే ఉంటూ.. తమని తాము కరోనా నుంచి రక్షించుకోవాలని ఆమె సూచించారు.

అయితే, ప్రధాని ప్రసంగానికి ముందు సోనియా తన సందేశాన్ని విడుదల చేయకుండా ఉండాలని సూచించామని బీజేపీకి చెందిన కొందరు వెల్లడించారు. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేసీ నడ్డా స్పందించారు. 

‘‘థాంక్యూ సోనియా జీ.. మీ ఆరోగ్యం జాగ్రత్త’’ అంటూ ఆయన కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. గతంలోనూ నడ్డా.. సోనియాపై పలుమార్లు విమర్శనాస్త్రాలు సంధించారు. దేశం క్లిష్ట పరిస్థితులు ఎదురుకుంటున్న సమయంలో సోనియా స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.