ఇండియాను ఎదుర్కొనే దమ్ముందా?: ఎన్డీఏను ప్రశ్నించిన మమత బెనర్జీ
విపక్ష కూటమి ఇండియాను ఢీకొనే సత్తా ఉందా అని ఎన్డీఏను ప్రశ్నించారు బెంగాల్ సీఎం మమత బెనర్జీ.

బెంగుళూరు:బీజేపీని ఓడించేందుకు కలిసి కట్టుగా పోరాడుతామని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ చెప్పారు.బెంగుళూరులో రెండు రోజుల పాటు విపక్ష పార్టీల సమావేశం జరిగింది.ఈ సమావేశం మంగళవారంనాడు మధ్యాహ్నం ముగిసింది.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మమత బెనర్జీ వివరించారు. విపక్ష పార్టీల సమావేశం నిర్మాణాత్మకంగా, ఫలప్రదంగా సాగిందన్నారు. ఇండియా గెలుస్తుంది, తద్వారా దేశం కూడ విజయం సాధిస్తుందని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు. బీజేపీ ఓడిపోతుందన్నారు.
ప్రభుత్వాలను కూల్చడమే కేంద్రంలోని ఎన్డీఏ పని అని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్డీయే తమ ఇండియా కూటమిని సవాల్ చేయగలరా అని ఆమె చాలెంజ్ విసిరారు.తాము తమ మాతృభూమిని ప్రేమిస్తున్నామన్నారు. తాము దేశభక్తులమని ఆమె పేర్కొన్నారు.
also read:ముంబై భేటీలో భవిష్యత్తు కార్యాచరణ: బీజేపీపై రాహుల్ ఫైర్
రాహుల్ గాంధీ తన ఫేవరేట్ లీడర్ అని ఆమె చెప్పారు. బీజేపీపై రాహుల్ బలంగా పోరాడుతున్నారని ఆమె కితాబిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
గత తొమ్మిది ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా రంగాలను నాశనం చేశారని న్యూఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తామంతా ఇక్కడ సమావేశమైంది దేశాన్ని ద్వేషం నుండి కాపాడడం కోసమేనని ఆయన చెప్పారు.విపక్ష పార్టీలకు చెందిన రెండో సమావేశం విజయవంతంగా సాగిందని శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని ఠాక్రే చెప్పారు.