ఎన్నికల ముంగిట బీజేపీ ప్రక్షాళన చేసింది. నాలుగు రాష్ట్రాల పార్టీ నూతన అధ్యక్షులను నియమిస్తూ ప్రకటనలు విడుదల చేసింది. 

న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట బీజేపీ ప్రక్షాళన చేపడుతున్నది. సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. నాలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చింది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభజ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయాలు తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చింది.

తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిని పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందే బండి సంజయ్.. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఆ భేటీలోనే సంజయ్‌కు నడ్డా ఈ విషయమై స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత జీ కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. జీ కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించారు.

Also Read: బండి సంజయ్ రాజీనామా: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించింది. జేపీ నడ్డా ఆయనకు ఫోన్ చేసి పదవీకాలం ముగిసిందని, పదవి నుంచి తప్పుకోవాలని సూచించినట్టు సోము వీర్రాజు తెలిపారు. అనంతరం, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరీని నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ సీఎం బాబులాల్ మరాండీని నియమించారు. అదే పంజాబ్ పార్టీ యూనిట్ చీఫ్‌గా సునీల్ జాఖర్‌ను నియమిస్తూ ప్రకటన చేశారు. సునీల్ జాఖర్ గతంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ యూనిట్‌ చీఫ్‌గానూ వ్యవహరించడం గమనార్హం.

రాజస్తాన్ బీజేపీ చీఫ్‌గా గజేంద్ర సింగ్ షెకావత్‌ను నియమించినట్టు కొన్ని వార్తలు వచ్చిన స్పష్టత లేదు. అలాగే.. మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ఒడిశా బీజేపీ చీఫ్‌గా భూపేంద్ర ప్రదాన్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది.