రాజస్థాన్ లో క్షీణించిన శాంతి భద్రతలు: జోథ్ పూర్ ఘటనపై గెహ్లాట్ పై బీజేపీ ఫైర్
రాజస్థాన్ లో వరుసగా చోటు చేసుకున్న ఘటనలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనలు రాష్ట్రంలో శాంతి భధ్రతల పరిస్థితిని సూచిస్తున్నాయన్నారు. సీఎం గెహ్లాట్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: రాజస్థాన్ జోథ్ పూర్ జిల్లాలోని ఒకే కుటుంబంలోని నలుగురు సజీవ దహనానికి గురయ్యారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు ఫైరయ్యారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతుందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
జోథ్ పూర్ జిల్లాలోని గంగనియోకిధానిలో నివసిస్తున్న పూనరం బైర్డ్, అతని భార్య భన్వరీ దేవి, కోడలు ధాపు, ఆరు నెలల పాప ఈ ఘటనలో మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
జోథ్ పూర్ లో చోటు చేసుకున్న ఈ నలుగురి సజీవ దహనంపై బీజేపీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తీవ్ర విమర్శలు చేశారు. తన స్వంత ప్రాంతంలోనే శాంతి భద్రతలను పరిరక్షించడంలో సీఎం ఆశోక్ గెహ్లాట్ విఫలమయ్యారన్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలను గెహ్లాట్ ఎలా కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. గెహ్లాట్ ప్రభుత్వ వైఫల్యానికి ఈ హత్యలను తార్కాణంగా ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్లర ఏళ్లలో రాజస్థాన్ ను నేరమయంగా మార్చారని ఆయన విమర్శించారు.
ప్రతి ఉదయం ఒక కొత్త గాయం వెలుగు చూస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్ చెప్పారు. జోథ్ పూర్ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేరాలపై సీఎం గెహ్లాట్ దృతరాష్ట్రుడిగా ఉన్నారని ఆయన విమర్శించారు.
జోథ్ పూర్ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని సజీవ దహనం చేసిన ఘటన తనను కలిచివేసిందని మరో ఎంపీ పీపీ చౌదరి చెప్పారు.
జోథ్ పూర్ జిల్లాలో నలుగురి హత్య ఘటన ను లక్ష్మీకాంత్ భరధ్వాజ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆరు నెలల చిన్నారిని కూడ వదిలి పెట్టలేదని ఆయన ఆవేదన చెందారు.ఈ ఘటన మీకు ఎలాంటి విచారం కల్గించదని రాహుల్ గాంధీని ప్రశ్నించారాయన.
రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకున్న ఘటనలపై సీఎం ఆశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.