గోద్రా తరహా ఘటనలు.. ఉద్ధవ్ థాకరేపై అనురాగ్ ఠాకూర్ ఫైర్..
రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత గోద్రా తరహా ఘటన జరగవచ్చని శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, సనాతన ధర్మాన్ని అవమానించడంతో మీరు అంగీకరిస్తారా అని బీజేపీ.. కాంగ్రెస్‌ను ప్రశ్నించింది.

రామమందిరం తర్వాత గోద్రా తరహా ఘటన జరగవచ్చని శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనపై బిజెపి విమర్శలు గుప్పించింది. ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, సనాతన ధర్మాన్ని అవమానించడంతో మీరు అంగీకరిస్తారా అని బీజేపీ .. కాంగ్రెస్‌ను ప్రశ్నించింది.
ఈ తరుణంలో కేంద్ర మంత్రి,బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిర్లక్ష్యపూరిత ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల నాయకులు హిందువులను అవమానిస్తున్నారని, సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవి, ఎయిడ్స్, డెంగ్యూ, మలేరియాతో పోల్చడాన్ని మీరు(కాంగ్రెస) అంగీకరిస్తుందా? ఇది బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడం కాదా? ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు ఆమోదయోగ్యమా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష కూటమిపై దాడి చేస్తూ అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. అవినీతిపరులు, రాజకీయ పార్టీలు, కుటుంబాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బెయిల్‌పై ఉన్న వారు తమ అవినీతి ముఖాన్ని దాచుకునేందుకు బట్టలు మార్చుకున్నారు. కానీ, వారి నడక, వ్యక్తిత్వం, అవినీతి కనిపిస్తున్నాయి. పేరు మార్చడం వల్ల ఏమీ రాదు. యూపీఏ పనితనం, కాంగ్రెస్ అవినీతి ఇవన్నీ ప్రజలకు తెలుసు అని అన్నారు.
కేంద్రమాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఉద్ధవ్‌ను టార్గెట్ చేశాడు. రాముడు వారికి కాస్తా బుద్ధి చెప్పాలని ప్రార్థిస్తున్నాను. ఇది సిగ్గుచేటు, అసభ్యకరమైన వ్యాఖ్య, దీన్ని ఖండిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే ఏమన్నారంటే?
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత గోద్రా తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘రామాలయం ప్రారంభోత్సవానికి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించే అవకాశం ఉంది. దీంతో ప్రజలు బస్సులు, ట్రక్కుల్లో అయోధ్యకు చేరుకుంటారు. వారు తిరుగు ప్రయాణంలో గోద్రా తరహా ఘటనలు జరగవచ్చు’నని అన్నారు.
గోద్రా ఘటన
27 ఫిబ్రవరి 2002న గుజరాత్ లోని అయోధ్య నుంచి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న కరసేవకుల రైలు కోచ్‌పై అల్లరి మూక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైలు కోచ్‌ను తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్ తోపాటు దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రామమందిరం ప్రారంభోత్సవం
కాగా, యూపీలోని అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మందిర ప్రారంభోత్సవాన్ని చూసేందుకు యావత్ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది జనవరి చివరి వరకు ఆ ఆలయంలోకి భక్తులను అనుమతించున్నట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఏడాది జనవరి 22న ప్రారంభించనున్నట్లు తెలిసింది.