Bharat Jodo Yatra: బీజేపీ, ఆరెస్సెస్ లు దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని ఆరోపించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Congress leader Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆయన పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాలుపంచుకుంటున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ అటునుంచి కర్నాటక మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తలు, ప్రజలు ఆయన రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ మాట్లాడుతూ మరోసారి కేంద్రంలోని బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఆరెస్సెస్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
బీజేపీ, ఆరెస్సెస్ లు దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాదయాత్ర ఆదివారం ఉదయం కర్నాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలను కూడా లేవనెత్తారు. భారత్ జోడో యాత్ర బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి, విద్వేషానికి, హింసకు విరుద్ధమని అన్నారు. "రెండు భారతదేశాలు" నేడు ఉనికిలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఒకటి ఎంపిక చేసిన కొద్దిమందికి చెందిన ధనవంతులకు చెందినదనీ, మరొకటి లక్షలాది మంది యువత, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులకు చెందినదని పేర్కొన్నారు.
ఈ రెండింటి మధ్య అంతరాలను పెంచుతూ ప్రభుత్వ పాలన సాగుతున్నదని ఆరోపించారు. “మాకు రెండు భారతదేశాలు వద్దు. మాకు ఒకే భారతదేశం కావాలి.. అందరికీ న్యాయం, ఉపాధి లభించాలి. దేశంలో సోదరభావం ఉండాలి’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతకుముందు, భారత్ జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోకి యాత్ర సాగుతున్నప్పుడు సరిహద్దులో కృష్ణా నదిపై ఉన్న వంతెన వద్ద వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు.
రాహుల్ గాంధీ తెలంగాణలో కొద్దిసేపు పాదయాత్ర చేసి జిల్లాలోని గుడెబెల్లూర్‌లో ఆగారు. హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయల్దేరిన ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆదివారం మధ్యాహ్నం నుండి అక్టోబర్ 26 వరకు మూడు రోజుల పాటు దీపావళి సందర్భంగా భారత్ జోడో యాత్రకు విరామం ఉంటుందని తెలంగాణ పీసీసీ శనివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత అక్టోబర్ 27న ఉదయం నారాయణపేట జిల్లా నుంచి యాత్ర పునఃప్రారంభమై తెలంగాణలో 19 అసెంబ్లీ, ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేర కొనసాగిన తర్వాత.. నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది.
రాహుల్ గాంధీ ప్రతిరోజూ 20-25 కిలో మీటర్ల 'పాదయాత్ర' చేపట్టనున్నారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతారు. మేధావులు, వివిధ సంఘాల నేతలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినీ రంగ ప్రముఖులతో భేటీ కానున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రార్థనా మందిరాలు, మసీదులు, దేవాలయాలను గాంధీ సందర్శించనున్నారు. కాగా, భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. తెలంగాణ యాత్ర ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో పాదయాత్రను పూర్తి చేశారు.
