మణిపూర్ సమస్య పరిష్కారానికి సర్జికల్ స్ట్రైక్ (Surgical strike) వంటి చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీకి మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నాయకుడు ఎం రామేశ్వర్ సింగ్ డిమాండ్ చేశారు.
మణిపూర్‌లో అక్రమ వలసదారులు, మిలిటెంట్ల సమస్యను పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ (Surgical strikes) వంటి ప్రభావవంతమైన చర్య చేపట్టాలంటూ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) నేత ఎం రామేశ్వర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మూడు నెలలుగా 150 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న జాతి హింసను చూస్తోన్న సంగతి తెలిసిందే.
సరిహద్దు దాటి కొందరు అక్రమ కుకీ ఉగ్రవాదులు, వలసదారులు వస్తున్నారని హోం మంత్రి చేసిన ప్రకటనలను బట్టి స్పష్టమవుతోందనీ, ఇందులో బాహ్య దురాక్రమణ ప్రమేయం ఉందని తాను ఎప్పటినుండో చెబుతున్నానని అన్నారు. మనం మణిపూర్ ను మాత్రమే కాకుండా మొత్తం దేశాన్ని రక్షించడం కూడా చాలా ముఖ్యమనీ, సమస్యను పరిష్కరించేందుకు సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రభావవంతమైన చర్యలను చేపట్టాలని ఎం రామేశ్వర్ సింగ్ అన్నారు.
కుకి మిలిటెంట్లంతా ఇప్పుడు శిబిరాల్లో ఉన్నారని, వారి వద్ద ఆయుధాలు ఉన్నాయని పలు ఏజెన్సీలు చెప్పుతున్నాయని అన్నారు. ఇలాంటి చొరబాటు దారులను నిర్మూలించాలని తాను కేంద్ర మంత్రిని అభ్యర్థిస్తున్నని అన్నారు.
గత నెలలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో నివసిస్తున్న మయన్మార్ నుండి అక్రమ వలసదారుల బయోమెట్రిక్ డేటాను సంగ్రహించడం ప్రారంభించింది. జూలైలో కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి 700 మంది అక్రమ వలసదారులు ప్రవేశించారని మణిపూర్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. హోం శాఖ ప్రకటన ప్రకారం.. మణిపూర్‌లో హింస చెలరేగుతున్న సమయంలో (జూలై 22 , 23 తేదీల్లో) 301 మంది పిల్లలతో సహా 718 మంది అక్రమ వలసదారులు మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు.
