పాములు పగ పడతాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందులో ఎంత వరకు నిజముందో తెలీదు కానీ.. ఓ యువకుడి కథ వింటే మాత్రం నమ్మాలనిపిస్తుంది. ఎందుకుంటే.. ఓ యువకుడిని ఒకే పాము.. కేవలం ఒక్క నెలలోనే ఎనిమిది సార్లు కాటు వేసింది.  అయితే.. పాము అన్ని సార్లు కాటు వేసినా.. అతను బతకడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లా, రామ్ పూర్ కు చెందిన యశ్ రాజ్ మిశ్రా  అనే యువకుడిని పాము ఎనిమిది సార్లు కాటు వేసింది. ఆ ఎనిమిదిసార్లు పాము కరిచినా.. తాను ప్రాణాలతో బయటపడ్డాడనని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కాగా..  సదరు యువకుడిని పాము కరవడంపై అతని తండ్రి ఓ మీడియా సంస్థ తో మాట్లాడారు.


‘‘ మా అబ్బాయి యశ్ రాజ్ ను ఆ పాము మూడోసారి కరిచిన తర్వాత అతనిని బహదూర్ పూర్ గ్రామంలో ఉన్న మా బంధువుల ఇంటికి పంపించాను. అయితే.. అక్కడికి వెళ్లి కూడా  అదేపాము మా అబ్బాయిని కాటేసింది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. ఇలా మొత్తం ఎనిమిదిసార్లు కాటు వేసింది. ఆ పాము మా అబ్బాయిని మాత్రం టార్గెట్ చేసుకొని ఎందుకు కాటేస్తోందో తెలియడం లేదు. ఈ వరస ఘటనలతో మా అబ్బాయి చాలా భయపడిపోతున్నాడు. ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు. పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చాం.. అయినా వాళ్లు కూడా పట్టుకోలేకపోయారు’’ అంటూ యువకుడి తండ్రి చెప్పాడు.