దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది.

ప్రస్తుత పరిస్ధితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. అలాగే ఫ్లూ నివారణ చర్యలు ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షించేందుకు కేంద్ర పాడి పశు సంవర్థక శాఖ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లలో బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో వైరస్ కేసులు వెలుగు చూడటంతో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

అటు హర్యానాలోని పంచకుల జిల్లాలో గత పదిరోజుల్లో నాలుగు లక్షలకు పైగా కోళ్లు మరణించాయి. అయితే వాటిలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్థారణ కాలేదని అధికారులు వెల్లడించారు.

మరోవైపు కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో దాదాపు 1700 బాతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. దాంతో ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా కోళ్లు, బాతులను చంపే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు.

దీనిలో భాగంగా 40000కు పైగా కోళ్లు, బాతులను చంపాల్సి వుంటుందని సమాచారం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ప్రస్తుత పరిస్ధితిపై దృష్టి సారించాయి.