భారతీయ బిలియనీర్, ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేష్ జున్‌జున్‌వాలా ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

భారతీయ బిలియనీర్, ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేష్ జున్‌జున్‌వాలా ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఉదయం 6.45 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇక, దేశీయ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్‌గా పిలుచుకునే రాకేష్ జున్‌జున్‌వాలా.. 1960 జూలై 5న బాంబైలో జన్మించారు. ఆయన తండ్రి ఆదాయపు పన్ను కమిషనర్‌గా పనిచేశారు. రాకేష్ జున్‌జున్‌వాలా సిడెన్‌హామ్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. అయితే మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన రాకేష్ జున్‌జున్‌వాలా 1985లో కేవలం రూ. 5,000తో తొలిసారిగా స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆయన కాలేజీలో చదువుతున్నారు. తాజా అంచనా (2022 జూలై) ప్రకారం.. ఫోర్బ్స్ ఆయన నికర ఆస్తి విలువ సుమారు 5.5 బిలియన్ డాలర్లు ఉంటుందని పేర్కొంది. 

ఇక, రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడిదారుడిగానే కాకుండా.. ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్నారు. కొన్ని భారతీయ సంస్థల డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాకేశ్ జున్‌జున్‌వాలా, జెట్ ఎయిర్‌వేస్ మాజీ సీఈఓ వినయ్ దూబే కలిసి Akasa Airను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ప్రస్తుతం 2 విమానాలు ఉన్నాయి. మరో 70 విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. ఆగస్టు 9 నాటికి Akasa Air మూడు నగరాలకు విమాన సేవలు అందిస్తుంది. 

‘‘మీరు రిస్క్ తీసుకున్నప్పుడు మీరు దాని గురించి స్పృహతో ఉండాలి. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారితే.. మీరు దానిని భరించగలగాలి. అది మిమ్మల్ని మానసికంగా ప్రభావితం చేయకూడదు’’ అని రాకేష్ జున్‌జున్‌వాలా చెప్పేవారు.

Scroll to load tweet…

ఇక, Rakesh Jhunjhunwala మృతిపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాకేష్ జున్‌జున్‌వాలా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశ పురోగతిపై రాకేష్ జున్‌జున్‌వాలా మక్కువ చూపారని కొనియాడారు. ఆయన మృతి బాధకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.