కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ బుధవారం సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ బుధవారం సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండియా స్టాక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇన్నోవేషన్ గురించి వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ సాగింది. ఈ సందర్భంగా బిల్ గేట్స్ తాను రాసిన ‘‘హౌ టూ అవైడ్ ఏ క్లైమేట్ డిజాస్టర్ (how to avoid a climate disaster)’’ పుస్తకం కాపీని రాజీవ్ చంద్రశేఖర్‌కు అందజేశారు. దానిపై ‘‘మనం కలిసి పనిచేసినందుకు ధన్యవాదాలు రాజీవ్’’ అని గేట్స్ సంతకం చేశారు.
బిల్ గేట్స్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌లో కో-ఛైర్మన్‌గా ఉన్న బిల్ గేట్స్.. కోవిడ్ మహమ్మారి తర్వాత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, రాజీవ్ చంద్రశేఖర్.. 1980ల మధ్యకాలంలో ఇంటెల్‌తో పనిచేసినప్పటి నుంచి బిల్ గేట్స్‌తో పరిచయం ఉంది. రాజకీయాల్లోకి రాకముందు రాజీవ్ చంద్రశేఖర్ టెక్నాలజీ రంగంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్నారు.
రాజీవ్ చంద్రశేఖర్.. ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చికాగో నుంచి 1986లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత చంద్రశేఖర్‌కి వచ్చిన మొదటి జాబ్ ఆఫర్ మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చింది. మైక్రోసాఫ్ట్ అప్పటికే యూఎస్‌లోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా మారింది. ఇక, ఇంటెల్ కంపెనీ కెఫెటేరియాలో బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, లారీ ఎల్లిసన్‌లతో డోనట్స్ షేరింగ్, చర్చలు జరపడం ఎంత సాధారణంగా ఉండేదో మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తుచేసుకున్నారు.
యూఎస్‌లోనే కొన్ని సంవత్సరాలు ఇంటెల్‌లో సీనియర్ డిజైన్ ఇంజనీర్‌గా, 80486, పెంటియమ్ మైక్రో ప్రాసెసర్‌లలో సీపీయూ ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన తర్వాత రాజీవ్ చంద్రశేఖర్ భారతదేశానికి తిరిగి వచ్చారు. 1994లో రాజీవ్ చంద్రశేఖర్ బీపీఎల్ మొబైల్‌ను స్థాపించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా నిలిచింది.
