కరోనాపై పోరు... ప్రధాని మోదీపై బిల్ గేట్స్ ప్రశంసలు
మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్యంపై అధిక నిధులు వెచ్చించడం, ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకులు బిల్ గేట్స్ ప్రస్తావించారని ఆ వర్గాలు తెలిపాయి.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం భారత్ పై కూడా బాగానే పడింది. కాగా.. ఈ మహమ్మారిని తరిమికట్టేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పడిపోతుందని తెలిసినా.. ప్రజల ప్రాణాలకే ఎక్కువ విలువ ఇచ్చి లాక్ డౌన్ విధించారు.
కాగా.. తాజాగా కరోనా పోరుపై మోదీ చేస్తున్న కృషిని ప్రపంచ కుబేరుడు, దాతృత్వశీలి బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. భారత్‌లో కోవిడ్-19 మహమ్మారి విస్తృత వ్యాప్తిని అరికట్టడంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పాటు వైరస్ అనుమానితులకు నిరతంరం టెస్ట్‌లు నిర్వహిస్తూ, క్వారంటైన్‌లకు పంపడం వంటి చర్యలు చేపట‍్టడం మెరుగైన ఫలితాలు ఇచ్చిందని ప్రధానిని ఉద్దేశించి బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలిపారు.
మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్యంపై అధిక నిధులు వెచ్చించడం, ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకులు బిల్ గేట్స్ ప్రస్తావించారని ఆ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్‌ను గుర్తించి, కాంట్రాక్ట్ ట్రేసింగ్‌కు సహకరించేలా ఆరోగ్య సేతు డిజిటల్ యాప్‌ను ప్రారంభించడం ద్వారా కోవిడ్-19ను ఎదుర్కోవడంలో డిజిటల్ సామర్ధ్యాలను ప్రభుత్వం పెంపొందించిదని బిల్‌గేట్స్ అన్నారని అధికారులు చెప్పారు.