2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మందికి రెమిషన్ మంజూరు చేసి.. విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో దోషులు ఇటీవల జైలు నుంచి విడుదల కావడంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మందికి రెమిషన్ మంజూరు చేసి.. విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. గుజరాత్ ప్రభుత్వ ప్రతిస్పందనను కోరింది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రిమిషన్ పొందిన వారిని పార్టీలుగా పరిగణించాలని పిటిషనర్లను ధర్మాసనం కోరింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
2002లో గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ బానో మూడేళ్ల కూతురుతో సహా 14 మంది కుటుంబ సభ్యులను హత్య చేశారు. ఈ కేసులలో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించారు. గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు మేరకు.. రిమిషన్ పాలసీ ప్రకారం ఈ కేసులో దోషులను విడుదల చేయడానికి అనుమతించింది. దీంతో వారు ఆగస్టు 15న దోషులు గోద్రా సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో వారు 15 ఏళ్లకు పైగా జైలు శిక్షను పూర్తి చేశారు. అయితే గుజరాత్ ప్రభుత్వం తీసుకన్న ఈ నిర్ణయంపై వివిధ రాజకీయ పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
బిల్కిస్ బానో కేసు దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ.. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, మరో పిటిషనర్ ద్వారా సుప్రీం కోర్టులో మూడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి.
