తొమ్మిది లక్షల మంది సబ్ స్క్రైబర్లతో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా పేరుపొందిన ఓ బైకర్ హత్యకేసులో ఇరుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్ అన్నను ప్లాన్ ప్రకారం చంపి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెడితే.. బైక్ స్టంట్లతో పాపులర్ అయిన నిజాముల్ ఖాన్ యూ ట్యూబ్ లో చాలా ఫేమస్. 

ఈ క్రమంలో ఓ యవతితో ప్రేమలో పడిన నిజాముల్‌ ఖాన్‌.. తరచుగా ఆమెను కలుస్తూ ఉండేవాడు. ఈ విషయం ఆమె సోదరుడు కమల్‌ శర్మ(26)కు తెలిసింది. దీంతో తన సోదరితో మాట్లాడొద్దని నిజాముల్ ను చాలాసార్లు హెచ్చరించాడు. 

కమల్ శర్మపై కోపం పెంచుకున్న నిజాముల్‌ ఖాన్‌ ఎలాగైనా అతడిని అంతం చేయాలనుకున్నాడు. తన ప్లాన్‌లో భాగంగా అక్టోబరు 28న కమల్‌ శర్మ ఇస్కాన్‌ టెంపుల్‌ నుంచి వెళ్తున్న సమయంలో, మోటార్‌ సైకిల్‌ మీద వెంబడించి తుపాకీతో కాల్చి పారిపోయాడు. బులెట్‌ గాయంతో రోడ్డు మీద పడి ఉన్న కమల్‌ను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

అయితే మొదట యాక్సిడెంట్‌గా భావించిన ఈ కేసులో అటాప్సీ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కమల్‌ సోదరుడు నరేశ్‌ శర్మ ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేపట్టగా, నిజాముల్‌ ఖాన్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలిందన్నారు. 

తన ఇద్దరు స్నేహితుల సాయంతో అతడు కమల్‌పై కాల్పులు జరిపాడని, యూట్యూబ్‌ వీడియోల ద్వారా వచ్చిన డబ్బులో కొంతవాళ్లకు ఇచ్చి ఈ నేరంలో భాగస్వామ్యం చేశాడని పేర్కొన్నారు. ముగ్గురిని అరెస్టు చేశామని, ఈ ఘటనతో మృతుడి సోదరికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.