మనిషిలో చిన్న చిన్న కారణాలకే క్షణికావేశం ఎక్కువైపోతోంది. ఈ కోపంలో ఎదుటి మనిషిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓవర్ టేక్‌ చేసేందుకు దారి ఇవ్వలేదన్న కోపంతో ఓ బైక్‌ రైడర్‌ బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బిల్కేర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో..  ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి కేఆర్‌ నగర్‌కు వెళ్తున్న బస్సును ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే ఎన్ని సార్లు ప్రయత్నించినా బస్సు డ్రైవర్‌ వెంకటేశ్‌ అవకాశం ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన బైక్‌ రైడర్‌ నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో వెంకటేశ్‌పై దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన వెంకటేశ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బైక్‌ రైడర్‌ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.