బిహార్‌లో కుల గణన చేపడతాం: సీఎం నితీష్ కుమార్.. అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం
బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ పక్కన కూర్చుని ఆయన మాట్లాడుతూ బిహార్‌లో కుల ఆధారిత సర్వే చేపడతామని ప్రకటించారు. వచ్చే క్యాబినెట్‌లో ఇందుకు సంబంధించిన చర్చ ఉంటుందని, ఆ తర్వాత కుల ఆధారిత లెక్కింపు ప్రారంభిస్తామని వెల్లడించారు.
పాట్నా: ఎట్టకేలకు బిహార్‌లో కుల గణనకు ముందడుగు పడింది. కుల గణనపై ఈ రోజు బిహార్ ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో కుల గణన చేపట్టడానికి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఇందులో బీజేపీ కూడా ఉండటం గమనార్హం. అయితే, చట్టపరమైన ఆటంకాలు రాకుండా ముందు జాగ్రత్తగా దీన్ని క్యాస్ట్ సెన్సస్ అని కాకుండా.. క్యాస్ట్ బేస్డ్ సర్వే అని చెబుతున్నట్టు సమాచారం.
అఖిల పక్షసమావేశం తర్వాత సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ కాకుండా ఆటంకాలు రాకుండా క్యాస్ట్ బేస్డ్ కౌంట్ చేపడతామని వెల్లడించారు. కుల ఆధారిత గణను తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ కూడా ఈ తీర్మానానికి ఆమోదం తెలిపింది. అన్ని పక్షాలు రాష్ట్రంలో కుల గణన చేపట్టడానికి అంగీకారం తెలిపాయని సీఎం వెల్లడించారు. త్వరలోనే నిర్దేశిత సమయ గడువులో కుల ఆధారిత లెక్కింపు రాష్ట్రంలో మొదలు పెడతామని తెలిపారు.
అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, అయితే, దీనిపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆ తర్వాత అమలు చేస్తామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు. తమ లక్ష్యం ఒకటేనని, అన్ని వర్గాల ప్రజలు సరిగ్గా అభివృద్ధి వైపు ప్రయాణించాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తోపాటుగా కూర్చుని విలేకరుల సమావేశంలో వివరించారు.
కాగా, ప్రతిపక్ష నాయుడు ఆర్జేడీ తేజస్వీ యాదవ్ దీన్ని తమ విజయంగా పేర్కొన్నారు. ఇది కుల ఆధారిత సెన్సస్(జనాభా గణన) కాదని, కేవలం కుల ఆధారిత సర్వే అని వివరించారు. ఇందులో సోషల్ ఆంథ్రపాలజిస్టులనూ చేర్చాలని ఆయన సూచించారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేకు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సర్వే బిహార్ ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్నామని తెలిపారు.
తదుపరి మంత్రివర్గంలో ఈ అంశంపై బిల్లు తేవాలని, నవంబర్ నెలలో కుల ఆధారిత సర్వేను ప్రారంభించాలని చెబుతున్నామని తేజస్వీ యాదవ్ అన్నారు. దుర్గా పూజల సమయంలో రాష్ట్రం బయటకు వలసలు వెళ్లిన వారు కూడా తిరిగి వస్తారని, ఆ సమయంలో ప్రజలు అందుబాటులో ఉంటారని, కాబట్టి, కుల ఆధారిత సర్వే చేపట్టడానికి అదే సరైన సమయం అని వివరించారు. అంతలోపు ఈ సర్వేకు సంబంధించిన ఏర్పాటు అన్నీ పూర్తి చేసుకోవాలని తెలిపారు.
బిహార్ రాజకీయాల్లో ఓబీసీ వర్గం ప్రాబల్యం అధికం. జనాభా పరంగానూ రాష్ట్రంలో ఓబీసీలు ఎక్కువ. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌లు ఇద్దరూ ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారే. కుల ఆధారిత సర్వే జరిగితే.. జనాభాకు తగినట్టుగా సంక్షేమ కార్యక్రమాలు హేతుబద్ధంగా అమలు చేయవచ్చనేది రాజకీయ పార్టీల మాట.
కుల ఆధారిత గణన కోసం నితీష్ కుమార్ కూడా చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని మోడీతోనూ ఆయన ఈ విషయమై సమావేశం అయ్యారు. బీజేపీ మినహా అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఈ డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా, ఇటువైపుగా కీలక అడుగు పడింది.